జగనన్న కాలనీ సమస్యలపై కృష్ణ చైతన్య పోరుబాట!
నరసన్నపేట, సూర్య :జగనన్న కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసన్నపేట మండలం రావాడపేటలోని జగనన్న కాలనీని సందర్శించిన ఆయన, స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చొరవతో నరసన్నపేట పట్టణ పరిధిలో 28 ఎకరాల భూమిని సుమారు రూ.5.60 కోట్లతో కొనుగోలు చేసి, 1,200 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే రూ.1.40 కోట్ల వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణం, ఇంటింటికీ కుళాయి సదుపాయం కల్పించే పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
అయితే, ప్రస్తుతం జగనన్న కాలనీవాసులు తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక వసతుల కోసం ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కాలనీవాసులకు తక్షణమే తాగునీటి సదుపాయం కల్పించాలని, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంత్యక్రియల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా స్మశాన వాటికకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు.
నరసన్నపేట పట్టణంలో విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయన్న ఆరోపణలపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా, నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, ముఖ్యంగా గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
జగనన్న కాలనీవాసుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకూడదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జగనన్న కాలనీవాసులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.