ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలి.. సీజేఐతో కూడిన త్రిసభ్య కమిటీని పునరుద్ధరించాలని వైఎస్ జగన్ డిమాండ్
సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు తక్షణమే కేంద్ర చట్టాన్ని సవరించాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేతతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సభ్యులుగా ఉండే పూర్వపు త్రిసభ్య ఎంపిక కమిటీ వ్యవస్థను మళ్లీ తీసుకురావాలని ఆయన కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితా నిర్వహణపై రెండు కమిషనర్లు గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ వస్తున్న వార్తలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటమే కాకుండా, అది ప్రజలకు స్పష్టంగా కనిపించాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గతంలో తాము కూడా మద్దతు తెలిపిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ చట్టం, 2023ను ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఒక విద్యార్థి తన పరీక్షకు తానే పరీక్షకుడిని నియమించుకున్నట్లుగా ఉంటే ఎంత నిజాయితీపరుడైనా ఆరోపణలు వస్తాయని, అందుకే నిష్పాక్షికమైన ఎంపిక ప్రక్రియ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అధికార పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, విపక్షంగా తాము చేసిన విజ్ఞప్తులను ఎన్నికల యంత్రాంగం పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డుల విభజనపై తాము లేవనెత్తిన అభ్యంతరాలను కూడా బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థల సమగ్రతను కాపాడటానికి, ఓటు హక్కుపై ప్రజల్లో భరోసా నింపడానికి కేంద్రం వెంటనే చట్ట సవరణ తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు.