జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి...
విజయనగరం, సూర్య : జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ విధివిధానాలు, సిబ్బంది బాధ్యతలపై శుక్రవారం వెబెక్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదు.
కౌంటింగ్ కేంద్రాల లోపలికి ఎలాంటి ద్రవ పదార్థాలను తీసుకురాకూడదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు, సిబ్బంది విధులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.రీకౌంటింగ్ కోరే అభ్యర్థుల అభ్యర్థనలను నిబంధనల ప్రకారం 15 నిమిషాల వ్యవధిలోనె స్వికరించాలి. ప్రతి హాల్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కోసం నిర్దేశించిన విధంగా కౌంటింగ్ టేబుళ్లు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
కౌంటింగ్ ఏజెంట్లకు నిర్ణీత సమయానికి అనుమతి కల్పించి, కౌంటింగ్ హాళ్లలోకి ప్రవేశించే విధానాన్ని క్రమబద్ధీకరించాలి. పోస్టల్ బ్యాలెట్ బాక్సులను నిబంధనల ప్రకారం తెరిచి, వాటి లెక్కింపు చేపట్టాలి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపును నిబంధనల ప్రకారం సమాంతరంగా నిర్వహించాలి. రీకౌంటింగ్ అనేది చెల్లుబాటు అయ్యే ఓట్లకు మాత్రమే సంబంధించి ఉంటుంది. చెల్లని ఓట్లను కూడా కలిపి రీకౌంటింగ్ చేయరాదు. చెల్లుబాటు అయ్యే, చెల్లని ఓట్లపై సందేహాలు తలెత్తినప్పుడు రిటర్నింగ్ అధికారి నిబంధనల ప్రకారం తుది నిర్ణయం తీసుకోవాలి. సందేహాస్పద ఓట్లకు టావులేదు.
కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, అధికారికంగా ధ్రువీకరించిన నివేదికలను అందించాలి. పోస్ట్ లో అందిన సర్వీస్ ఓట్ల వివరాలను అభ్యర్థులకు నిబంధనల ప్రకారం తెలియజేయాలి.
ఈ సూచనలన్నింటినీ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది తప్పనిసరిగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వెబెక్స్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, డీఆర్ఓ సిహెచ్. సత్తిబాబు, జిల్లా పరిషత్ సీఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ సీఈఓ లవరాజు, ఆర్డీఓలు, డీఎల్‌డీఓలు, రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.