ఇంకొల్లు మండలంలో ఎమ్మెల్యే ఏలూరి పర్యటన
ఇంకొల్లు, మేజర్న్యూస్ :గ్రామీణ ఆధ్యాత్మికత, అభివృద్ధి కార్యక్రమాల సమాహారంగా నక్కలపాలెం గ్రామంలో సందడి నెలకొంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నిర్వహించిన శ్రీ పోలేరమ్మ తల్లి, పోతురాజు స్వామి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం, డైనింగ్ హాలును ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు. అలాగే గ్రామస్థుల సమావేశాలకు, ప్రజల పరస్పర చర్చలకు ఉపయోగపడే రచ్చబండ దిమ్మెను ప్రారంభించారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలు అందుబాటులోకి రావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రజలను పేరుపేరునా పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడారు. గ్రామస్థుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన రాకతో గ్రామంలో సందడి నెలకొంది. ప్రజలతో కలిసిమెలిసి సాగిన ఎమ్మెల్యే పర్యటన స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం పావులూరులో కొంగర శ్రీనివాసరావు కుమారుడు వివాహ వేడుక సందర్భంగా పెళ్లి కుమారుడికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పూసపాడులో బొడావుల రఘురాం కుమారుడు వివాహ వేడుకకు హాజరై వరుడుని ఆశీర్వదించారు.
సూర్య రిపోర్టర్ షేక్ జానిబాష, ఇంకొల్లు.