ఇక్కడ మహిళా....అక్కడ ఎస్టీ జనరల్ * సమరానికి సై అంటున్న టీడీపీ, వైసీపీ
విజయనగరం ప్రతినిధి, సూర్య : కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నది ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఏళ్లతరబడి ఉత్కంఠకు తెరపడింది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాపరిషత్ రెండుగా విడిపడి విడివిడిగా మారింది. దీంతో, పాలనలో సౌలభ్యం కనపడనుంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ జిల్లాల పునర్విభజన చేపట్టినప్పటికీ, జిల్లాపరిషత్ మాత్రం ఒక్కటిగానే కొనసాగింది. రెండు జిల్లాలకు వేర్వేరు జెడ్పీలు ఉండాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, ఉమ్మడి జెడ్పీకి జై కొట్టింది. దీంతో, భౌగోళికంగా నిడివి పెరిగింది. దీని ప్రభావం పాలనపై స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి జిల్లా చైర్మన్ గా మజ్జి శ్రీనివాసరావు ఉభయ జిల్లాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఆచరణలో ఇబ్బందులు తప్పలేదు. కాగా, రెండేళ్ల క్రితం కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో వేర్వేరు జెడ్పీల అంశం తెరపైకి వచ్చింది. స్థానిక ఎన్నికలునాటికి అమలు జరుగుతుందని అంతా ఊహించినట్టే కూటమి సర్కారు జెడ్పీని రెండుగా విభజిస్తూ ఇటీవల గెజిట్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా కొత్తగా ఏర్పడనున్న పార్వతీపురం మన్యం జిల్లా జెడ్పీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసి స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం చేస్తోంది.2022 లో కొత్త జిల్లాల విభజన జరిగినా జడ్పీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతూ వచ్చింది. ఇక, విజయనగరం, పార్వతీపురం రెండు జడ్పీలుగా ఏర్పాటు కానున్నాయి. విజయనగరంలో శ్రీకాకుళం నుంచి రాజాం చేరడంతో 6 నియోజకవర్గాలు, శ్రీకాకుళం నుంచి పాలకొండ పార్వతీపురంలో చేరడంతో 3 నియోజక వర్గాలు చేరుతున్నాయి. అంటే, ఉభయ జెడ్పీల పరిధిలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండనున్నాయన్న మాట. వేర్వేరు జెడ్పీ ల నేపథ్యంలో ఉద్యోగుల విభజన, భవనాలు గుర్తింపు పై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానిక ఎన్నికలకు ఏ క్షణమైనా నగారా మోగనున్న నేపథ్యంలో కొత్త జెడ్పీ కి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గతనెల 24తో ప్రస్తుత జెడ్పీల పదవీకాలం పూర్తన సంగతి తెలిసిందే. ఉమ్మడి జెడ్పీకి చివరి చైర్మన్ గా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఇలాఉండగా, రెండు జెడ్పీల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వాటిపై దృష్టి పెట్టాయి. రెండింటిలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నాయి. విజయనగరం బీసీ మహిళ, పార్వతీ పురం మన్యం ఎస్టీ జనరల్ కు కేటాయించడంతో రాజకీయాలు ఆసక్తిగా మారిపోతున్నాయి. గెలుపు గుర్రాల ఎంపికపై దృష్టిని కేంద్రీకృతం చేస్తున్నాయి. గత స్థానిక ఎన్నికల్లో నాటి అధికార వైసీపీ.. బలప్రయోగంతో, సామధాన బేద దండోపాయాలతో పంచాయతీ నుంచి జెడ్పీ వరకు ఖాతాలో జమచేసుకొని టీడీపీని నామమాత్రం చేసి, రాజ్యం వీర భోజ్యం తరహాలో ఐదేళ్లపాటు వీరవిహారం చేసి అడుగడుగునా అవమానించిన నేపథ్యంలో, ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యేలా చేసి వైసీపీ పెట్టిన కష్టాలను వడ్డీతో సహా బదులు తీర్చుకోవాలని టీడీపీ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు స్కెచ్ సిద్ధం చేసింది. రిజర్వేషన్లు వెల్లడైన మరుక్షణమే కార్యక్షేత్రంలోకి దూకేందుకు సర్వ సన్నద్ధమవుతోంది. అయితే వైసీపీలో మునుపటి జోష్ కనిపించడంలేదు. అయినప్పటికీ, గెలిచి తీరుతామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. టీడీపీ, వైసీపీ అదిగో ఇదిగో అభ్యర్ధి అంటూ ప్రచారం చేస్తున్న అధిష్టానాలు ఎవరికి బొట్టు పెడతాయో నన్న చర్చ సాగుతోంది. ఏదేమైనా సర్వత్రా స్థానిక రాజకీయ సందడి మొదలైందనే చెప్పాలి.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.