గుత్తేదారుల అలక్ష్యం వాహనదారుల ఇక్కట్లు - అడుగడుగుకో గుంట - కప్పేస్తున్న దుమ్ము - ప్రమాదాలు
గూడూరు, మేజర్‌న్యూస్ : చిల్లకూరు మండల ప్రధాన రహదారిపై భారీ వామనాల రాకపోకలతో రహదారి చిధ్రమై వాహనదారులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. చిల్లకూరు తీర ప్రాంతంలోని కృష్ణపట్నం పోర్ట్ ఆదారంగా ఏర్పాటు అవుతున్న పారిశ్రమిక అవసరాల నిమిత్తం రహదారులు, ఇతర నిర్మాణాలకు ముడి పదార్దాలు( కంకర, వెట్ మిక్చర్, బిటుమిన్, సిలికా, గ్రావెల్, ఇసుక, స్టీల్) రవాణ పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రధానంగా 16వ నంబర్ జాతీయ రహదారిపై వరగలి కూడలి వద్ద నుంచి పోర్ట్‌కు నిర్మాణంలో ఉన్న నాలుగు వరుసల రహదారి, తమ్మినపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న క్రిస్ సిటీకి వస్తున్న భారీ వాహనాలతో ప్రదాన రహదారి తీవ్రంగా దెబ్బతింటోంది. 60-70 టన్నుల సామర్ధ్యం ఉన్న టిప్పర్లు గ్రావెల్, ఇతర నిర్మాణ వస్తులతో నిత్యం తిరుగుతోంది. జాతీయ ప్రయోజనాల రీత్యా పరిశ్రమలు, మౌళిక వసతుల కల్పనలో అందరూ సహకరించాల్సి ఉన్నా ఆయా నిర్మాణ సంస్థ స్థానిక ప్రజల ప్రయోజనాలను పట్టించు కోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంపై ఆందోళన నెలకొంటుంది. ఈ సంస్థల(మేఘ, బివిఎస్‌ఆర్) ప్రతినధులు స్థానికంగా లభించే అన్ని రకాల సహజ వనరులను దోపిడీ చేస్తున్నా కనీసం కన్నెత్తి చూడని అధికారులు ప్రజల ఇబ్బందులైనా దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవల్సి ఉంది. మేఘ, బివిఎస్‌ఆర్ వాహనాల కారణంగా జరిగిన ప్రమాదాలలో మృతులు, క్షతగాత్రులు అవుతున్నా ఆ వాహనాల రాకపోకలతో దెబ్బతిన్న రహదారి మరమ్మతులకు నడుం బిగించక పోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఆందోళన చేసిన సందర్భాల్లో తూతూ మంత్రంగా మరమ్మతులు చేయడం తర్వాత గాలికి వదిలేస్తున్నారు. ప్రధానంగా నాంచారంపేట, పాలిచర్లవారిపాళె, తిక్కవరం, కలవకొండ అంకులపాటూరు గ్రామాల వద్ద రహదారి పెద్ద పెద్ద గుంటలు పడి ప్రయాణం నరక ప్రాయంగా మారుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వర్షం కురిసినా ఆ గుంటల్లో నీళ్లు చేరి రహదారిపై ప్రయాణం మరింత ఇబ్బందికరంగా మారుతోంది. దీనికతోడు సిలికా తరలిస్తున్న భారీ టిప్పర్లు, ధర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి బూడిద తరలిస్తున్న బల్కర్లు కారణంగా వాహనదారులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం అని చెప్పాలి ఇకనైనా అధికారులు మండల ప్రధాన రహదారిపై కనీస మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.