గురుకులంలో ఘనంగా బాలల దినోత్సవం.. ఆకట్టుకున్న కిచెన్ గార్డెన్ ఫెస్టివల్
పర్చూరు, మేజర్‌న్యూస్ :
బాపట్ల జిల్లా పర్చూరు మండలం నాగులపాలెంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలో ‘కిచెన్ గార్డెన్ ఫెస్టివల్’ నిర్వహించారు. ముందుగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తాము స్వయంగా పండించిన రసాయన ఎరువులు లేని ఆకుకూరలు, కూరగాయలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సేంద్రీయ సాగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను విద్యార్థులు చక్కగా వివరించారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ పోటీలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.