గ్రంథాలయాలతోనే విజ్ఞాన వికాసం
మెలియాపుట్టి. నవంబర్ 14. మేజర్ న్యూస్...
విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించి, వారిలో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. మెలియాపుట్టి శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను శనివారం ఘనంగా ప్రారంభించారు. గ్రంథాలయ అధికారిణి ఆర్. అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంఈఓ దేవేందర్ రావు, నలంద పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ప్రతాప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తొలుత భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సరస్వతీ దేవి చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తక పఠనం ప్రాముఖ్యతను వివరించారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా పాఠ్యాంశాలతో పాటు సమాజం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రం వంటి అనేక విషయాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని సూచించారు.
వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కేజీబీవీ, నలంద పబ్లిక్ స్కూల్, ఎంపీ స్కూల్‌లకు చెందిన సుమారు 80 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ చిత్రలేఖన ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం కల్పించేలా పోటీలు నిర్వహించడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గోవిందరావు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, ఉపాధ్యాయులు అనిల్, నీలిమ, చిన్నబాబు, పాఠకులు లక్ష్మీపతి, మణి, గ్రంథాలయ సహాయకురాలు హేమలత, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.