గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి..
కోటబొమ్మాళి, సూర్య : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, నదుల్లో కొనసాగుతున్న వరద ప్రవాహంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో ఫోన్‌లో సమీక్షించారు. వంశధార, నాగావళి, బహుదా నదుల్లో నెలకొన్న ప్రస్తుత వరద పరిస్థితులు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులు, ప్రభావిత గ్రామాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైన చోట్ల ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన ఆహార పొట్లాలు, అత్యవసర మందులతో కూడిన వైద్య కిట్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, దీనివల్ల సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు అవసరమైన చోట్ల బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జ్వరాలు, ఇతర వ్యాధుల లక్షణాలు కనిపించిన వారికి తక్షణమే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బహుదా నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. రహదారులపై వరద నీరు ప్రవహించే ప్రాంతాల్లో రాకపోకలను నియంత్రిస్తూ, ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. వరద పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు రెవెన్యూ, పోలీస్, వైద్య, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, బాధితులకు అవసరమైన సహాయాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందించాలని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌కు దిశానిర్దేశం చేశారు.