గిరిజనుల శ్మశానవాటికకు రక్షణ కల్పించాలి కలెక్టరేట్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా
నెల్లూరు కలెక్టరేట్ మేజర్ న్యూస్ : కొడవలూరు మండలం మానేగుంటపాడు గ్రామంలోని గిరిజనుల శ్మశానవాటికకు రక్షణ కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపోగు రమణయ్య మాట్లాడుతూ, మానేగుంటపాడు గ్రామంలో గిరిజనులకు చెందిన ఎకరా 40 సెంట్ల శ్మశానవాటిక సుమారు 100 సంవత్సరాలుగా ఉందన్నారు. శ్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని గిరిజనులు కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారని తెలిపారు. అయితే, శ్మశానవాటిక పక్కన తన పొలం ఉందని, పొలానికి దారి కావాలంటూ గుణపాటి మల్లికార్జున రెడ్డి ఫెన్సింగ్ రాళ్లను తొలగించి గిరిజనులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి, ఫెన్సింగ్ రాళ్లను తొలగించిన వ్యక్తిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గిరిజనుల శ్మశానవాటికకు శాశ్వత రక్షణ కల్పించి, వారి హక్కులను కాపాడాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీపీఐ నెల్లూరు నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు అజీజ్ అహ్మద్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షానవాజ్, సీపీఐ కోవూరు నియోజకవర్గ కార్యదర్శి విజయ్, ఎరుకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇట్టా వెంకటేశ్వర్లు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గుది విజయకుమార్, సీపీఐ జిల్లా సమితి సభ్యుడు షాజహాన్, మున్వర్, షాకీర్, హరీస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు కూడా ధర్నాలో పాల్గొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.