గెలుపే లక్ష్యంగా కూటమి వ్యూహరచన -స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగరేలా సన్నాహక భేటీ -ప్రచారం, సమన్వయం, క్షేత్రస్థాయి వ్యూహంపై కూటమి నేతల సుదీర్ఘ మంతనాలు -తిరుపతి నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు కీలకం : కూటమి నేతలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు పక్క ప్రణాళికతో వ్యూహరచన చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన చారిత్రాత్మక విజయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించాలన్న లక్ష్యంతో తిరుపతిలో కూటమి నాయకుల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ మెరకు సోమవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో కూటమి అగ్ర నాయకులు భేటీ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పార్టీల ముఖ్య నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. ఎన్నికల ప్రచారం ఎలా సాగాలి? క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉండాలి? ప్రతి డివిజన్‌లో గెలుపు వ్యూహం ఏమిటి? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి, తిరుపతి పార్లమెంట్ స్థానిక ఎన్నికల అబ్జర్వర్ నుకసాని బాలాజీ, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పాల్గొని నేతలకు పలు కీలక అంశాలపై దిశా నిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తితో పనిచేయాలి. తిరుపతి నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు ఎంతో కీలకం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు.
కూటమి ఐక్యతేనే ఎన్నికలకు మరింత బలం
ఈ భేటీలో ముఖ్యంగా కూటమిలోని మూడు పార్టీల మధ్య ఐక్యత, సమన్వయంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. డివిజన్ల వారీగా ఇన్‌ఛార్జ్‌లు, ప్రచార కార్యక్రమాల నిర్వహణ, బూత్ స్థాయి కమిటీల బలోపేతం, ఓటర్లతో ప్రత్యక్ష సంబంధం వంటి అంశాలపై నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. తిరుపతి నగరంలో కూటమి బలంగా ఉందని, ప్రతిపక్షం ఎంతగా ప్రయత్నించినా ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని నేతలు ధీమా వ్యక్తం చేశారు. మేయర్ అభ్యర్థి గెలుపుతో పాటు అన్ని డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహం రూపొందించినట్లు తెలిసింది. గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు చేసిన ఈ సన్నాహక భేటీ తిరుపతి రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సన్నాహక భేటీలో యాదవ కార్పొరేషన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శాప చైర్మన్ అనిమిని రవి నాయుడు, తిరుపతి మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామాంచి శ్రీనివాస్, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ నైనర్ మహేష్ యాదవ్, రఘురాం, తదితరులు, హాజరయ్యారు.
రాజకీయ విశ్లేషణ…
తిరుపతిలో కూటమి నేతలు ఇంత ముందుగానే సమావేశమై వ్యూహరచన చేయడం వెనుక స్పష్టమైన రాజకీయ సంకేతం ఉంది. స్థానిక ఎన్నికలు కేవలం కార్పొరేషన్‌కే పరిమితం కాదు. ఇది రాబోయే రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఎన్నిక. అందుకే కూటమి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నాయకులందరూ ఏకతాటిపైకి రావడం, క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించడం కూటమికి పెద్ద బలంగా మారనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్