గౌడ కల్లు గీత కార్మికులకు పెన్షన్లు, ఇంటి స్థలాలు కల్పించాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి వినతిపత్రం అందజేసిన గౌడ సంఘం నాయకులు
ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని గౌడ సంఘానికి చెందిన కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గౌడ సంఘం నాయకులు, కల్లు గీత కార్మికులు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్లు గీత కార్మికులు తమకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో ఏళ్లుగా కల్లు గీత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికుల్లో పలువురు వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అర్హులైన కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం నుంచి పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, సొంత ఇల్లు లేని నిరుపేద కార్మిక కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.
అలాగే గౌడ సంఘం కల్లు గీత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన కార్మికులకు ప్రయోజనం కల్పించేలా సహకరించాలని ఎమ్మెల్యేను కోరారు. గౌడ సంఘం కల్లు గీత కార్మికులు సమర్పించిన వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వారి సమస్యలను పరిశీలించి, సాధ్యమైనంత మేర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, కల్లు గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.