గజలక్ష్మి అలంకారంలో అమ్మవారి దివ్యదర్శనం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : నెల్లూరు మూలాపేటలో వేంచేసియున్న ప్రసిద్ధ శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిప్రపత్తులతో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో మూలవర్లకు శాస్త్రోక్తంగా విశేష అభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ విశేష పూజలకు కందికట్టు మధుసూదన్, గిరిజ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం జరిగిన కలశపూజ, చండీహోమ కార్యక్రమాలలో సాయి పవన్ కుమార్ ఉభయకర్తగా పాల్గొని విశేష పూజలు జరిపించారు.సాయంత్రం అమ్మవారు విశేష 'శ్రీ గజలక్ష్మి దేవి' దివ్యాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశేష అలంకార పూజలకు సునీల్ కుమార్ - మహాలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం శ్రీ లలితా సహస్రనామ పారాయణ బృందం ఉభయకర్తలుగా వ్యవహరించిన సామూహిక లలితా సహస్రనామ పారాయణ అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. సాయంత్రం నిర్వహించిన పవిత్ర చండీ యాగంలో మాలేపాటి శ్రావణి, మాలేపాటి మనుతేజ, మాలేపాటి ఝాన్సీ ఉభయకర్తలుగా పాల్గొన్నారు. తదనంతరం వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి పల్లకి సేవను ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ సురేంద్ర యాదవ్, కార్యనిర్వహణాధికారి వి. గిరికృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, పులికొలను చంద్రశేఖర్, ఆలయ ముఖ్య అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.