గాజుల అలంకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి
ఇంద్రకీలాద్రి మేజర్ న్యూస్ : దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కార్తీక శుద్ధ విదియ (భగినీ హస్తభోజనం) పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 11న నిర్వహించనున్న కనకదుర్గ అమ్మవారి విశేష గాజుల అలంకారోత్సవానికి ఆలయ సంప్రదాయాలు, ఆనవాయితీలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ తెలిపారు. మహామండపం ఆరో అంతస్తులో గాజుల అలంకరణ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత ఏడాది నాలుగు లక్షలకు పైగా గాజులతో ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించామని, ఈ ఏడాది అంతకు రెట్టింపు సంఖ్యలో గాజులతో అమ్మవారి మూలవిరాట్‌కు దివ్యాలంకరణ చేయడంతో పాటు ఆలయ ప్రాంగణమంతా శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విశేష ఉత్సవం కోసం భక్తులు, దాతల నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున గాజులు విరాళంగా అందుతున్నాయని, అలంకరణకు ఇంకా ఏమైనా అవసరమైతే దేవస్థానం తరఫున సమకూరుస్తామని స్పష్టం చేశారు. గాజుల అలంకారోత్సవం అనంతరం అమ్మవారి సన్నిధిలో పూజించిన పవిత్ర గాజులను దర్శనానికి వచ్చే మహిళా భక్తులకు అమ్మవారి దివ్యప్రసాదంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పర్వదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని ఈవో పేర్కొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.