ఎన్నికల కోడ్పై ప్రజలకు అవగాహన గ్రామాల్లో డీఎస్పీ దైవప్రసాద్ పల్లె నిద్ర హనుమాపురం, హనకనహాల్, 43 ఉదేగోళంలో పోలీసుల పర్యటన
రాయదుర్గం : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా కళ్యాణదుర్గం డీఎస్పీ టి. దైవప్రసాద్ ఆధ్వర్యంలో రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, కనేకల్ ఎస్ఐ నాగమధు, పోలీసు సిబ్బంది కలిసి హనుమాపురం, హనకనహాల్, 43 ఉదేగోళం గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలతో మమేకమై ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను వివరించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడకూడదని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్నికల కోడ్ను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
గ్రామాల్లో ఎక్కడైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కార్యకలాపాలు జరిగినా, అక్రమాలకు పాల్పడినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ప్రజల్లో ఎన్నికల నియమావళిపై అవగాహన పెంపొందించడంతోపాటు, గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు పల్లె నిద్ర కార్యక్రమం దోహదపడుతుందని పోలీసులు తెలిపారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
రిపోర్టర్ : శివకుమార్, రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం.