దుర్గాదేవి అలంకారంలో భువనేశ్వరి అమ్మవారి దర్శనం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
నెల్లూరు మూలపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆశ్వీజ శుద్ధ అష్టమి సందర్భంగా ఆలయంలో విశేష పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నేత్రపర్వంగా సాగాయి.
ఉదయం అమ్మవారికి విశేష అభిషేకాలు, శాస్త్రోక్తంగా నవావరణ పూజ నిర్వహించారు. ఈ పూజా మహోత్సవానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం లోకకల్యాణార్థం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా శ్రీ చండీ హోమం నిర్వహించగా, శ్రీ కొడవలూరు సుబ్బారెడ్డి, శైలజమ్మ దంపతులు ఉభయకర్తలుగా పాల్గొని హోమ క్రతువును జరిపించారు.రాత్రి భువనేశ్వరి అమ్మవారు శ్రీ దుర్గాదేవి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రాకారోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శిరీష దంపతులు ఉభయకర్తలుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. శ్రీ శ్రీకృష్ణ గోదాదేవి భజన బృందం ఆధ్వర్యంలో శ్రీమతి చంద్రకళ బృందం చేతుల మీదుగా సాగిన కోలాట మహోత్సవం, ఎస్.ఆర్.ఎన్.ఎల్ యోగా అండ్ డాన్స్ అకాడమీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవ ఏర్పాట్లను ఆలయ చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు.