దేశ ప్రగతిలో జర్నలిస్టుల సేవలు నిరుపమానం
విశాఖపట్నం, సూర్య : దేశ ప్రగతిలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు నిరుపమానమని ప్రముఖ సంఘ సేవకులు మట్టపల్లి హనుమంతరావు, డాక్టర్ జహీర్ అహ్మద్ లు కొనియాడారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతోపాటు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం విశాఖ పాత నగరంలోనీ పోస్ట్ ఆఫీస్ వద్ద వివేకానంద అనాథ, వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని అనాథలు, వృద్ధులకు అన్నదానం చేపట్టడంతోపాటు వస్త్రదానంలో భాగంగా దుప్పట్లు, చీరలు, ఇతర నిత్యావసర సామగ్రిని అతిథుల చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మట్టపల్లి హనుమంతరావు, డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి జర్నలిస్టులు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సామాజిక బాధ్యతను చాటుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణ మాట్లాడుతూ ఫెడరేషన్ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఇప్పటికే పలు డిమాండ్ల సాధనలో ముందడుగు వేశామని తెలిపారు.
భవిష్యత్తులో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్‌తోపాటు ఇతర సంక్షేమ సదుపాయాలు కల్పించేందుకు మరింత అంకితభావంతో కృషి చేస్తామని గంట్ల శ్రీనుబాబు స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. కులమతాలకు అతీతంగా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ఆర్ లక్ష్యంగా ఫెడరేషన్ ముందుకు సాగుతోందని, తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ప్రముఖ సంఘ సేవకులు డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్, మట్టపల్లి హనుమంతరావు, రౌండ్ టేబుల్ అధ్యక్షులు మక్సూద్ అహ్మద్ ఏపీడబ్ల్యుజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ధవలేశ్వరపు రవికుమార్ ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి నాయుడు, సంయుక్త కార్యదర్సులు నగేష్,రవిశంకర్,ఏపీబీజేఏ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడమదన్,ఏపీ స్మాల్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, ఇతర ప్రతినిధులు కె. వి. శర్మ, బొబ్బర ప్రసాద్, జి జగన్, గణేష్ రెడ్డి, ప్రసాద్, రాజశేఖర్, ఫెడరేషన్ ప్రతినిధులు, జర్నలిస్టులు, ఆశ్రమ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.