దాదాపు రూ.కోటితో ఉర్దూ పాఠశాల అభివృద్ధి.. కళాశాల ఏర్పాటుకు హామీ
బుచ్చిరెడ్డిపాళెం, మేజర్ న్యూస్ : ఎనిమిదో తరగతి తర్వాత చదువును కొనసాగించలేకపోతున్న మైనారిటీ బాలికలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బుచ్చిరెడ్డిపాళెంలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రూ.75 లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో ఉన్నత పాఠశాలను నిర్మిస్తామని కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఇప్పటికే రూ.20 లక్షలతో స్థలం కొనుగోలు చేశామని తెలిపారు. అలాగే, మైనారిటీ విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటునందించేందుకు బుచ్చిరెడ్డిపాళెంలో ఉర్దూ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ ఇంటింటి ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని 12, 13 వార్డుల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మితో పాటు 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ రహ్మత్ బాషా, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ పర్వీన్లను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలు, పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం మైనారిటీ సోదరులు తనకు అండగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తుచేశారు. తన విజయానికి తోడ్పడిన వారి అభ్యున్నతి కోసం తాను, తన కుమారుడు డా.అర్జున్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. విద్య, మౌలిక సదుపాయాలు, సంక్షేమ రంగాల్లో అవసరమైన సహకారం అందిస్తూ మైనారిటీ కుటుంబాలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
దొడ్ల కుటుంబం సేవాభావం ప్రజలకు సుపరిచితం
దొడ్ల కుటుంబం ప్రజాసేవకు, దాతృత్వానికి మారుపేరుగా నిలిచిందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా పేదలకు అండగా నిలిచిన ఈ కుటుంబం బుచ్చిరెడ్డిపాళెంలో ఆసుపత్రి, పాఠశాల వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. ప్రజాసేవను కొనసాగించాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన దొడ్ల విజయలక్ష్మిని మున్సిపల్ ఛైర్పర్సన్గా గెలిపించాలని కోరారు. అలాగే, 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ రహ్మత్ బాషా, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ పర్వీన్లకు ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సూపర్ సిక్స్ పథకాల ద్వారా పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని వివరించారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా పనిచేసే నాయకులకు అవకాశం కల్పించాలని కోరారు.
నీతికి–అవినీతికి, అభివృద్ధికి–అరాచకానికి మధ్య పోటీ
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ ఎన్నికలు కేవలం అభ్యర్థుల మధ్య జరిగే పోటీ మాత్రమే కాదని, నీతికి–అవినీతికి, ధర్మానికి–అధర్మానికి, న్యాయానికి–అన్యాయానికి, అభివృద్ధికి–అరాచకానికి మధ్య జరుగుతున్న పోటీ అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు అభివర్ణించారు. ప్రజాసేవకు, నిజాయితీకి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇచ్చి, బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.