చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్
ఏపీ సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : ;పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వేములకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని రాకోట గిరిశిఖర గ్రామంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదివారం పర్యటించారు. ‘అడవితల్లి బాట 2.0’ కార్యక్రమంలో భాగంగా కాకవాడ, రాకోట, సువర్లవాడ, వేములకొండ గ్రామాలను కలిపేలా రూ.2.29 కోట్లతో 3.4 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం రాకోట గ్రామంలోని చింతచెట్టు కింద రచ్చబండ వద్ద గిరిజనులతో ‘మాటా-మంతి’ నిర్వహించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని ఎంపీపీ పాఠశాల శిథిలావస్థలో ఉండటాన్ని గుర్తించిన పవన్ కళ్యాణ్ దాని పునరుద్ధరణకు రూ.20 లక్షలు, విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరు చేశారు. రాకోట గ్రామస్థుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, ఆలయాన్ని భజన మందిరంగా అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ సహకారంతో మరో రూ.20 లక్షలు కేటాయించారు. వేములకొండ, సువర్లవాడ, డబ్బావలస, తిరుగటిరాళ్లు, కాకవాడ, చిలకవీధి, వెట్టిచెలకలు, సోకులగూడెం తదితర గ్రామాల గిరిజనులు తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, ప్రతి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంతో కూడిన మండల పరిషత్ పాఠశాల, విలేజ్ హెల్త్ క్లినిక్ మంజూరు చేస్తూ ఆయన తక్షణ ఆదేశాలు జారీ చేశారు. వివిధ పథకాల ద్వారా దాదాపు రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. రాకోటలో వెదురు బొంగులతో గృహోపకరణాలు తయారు చేస్తున్న కొమ్మిరెడ్డి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెదురు ఉత్పత్తులకు మరింత విలువ జోడించి గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం లభించేలా ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాకోటకు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు గిరిజన మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు. స్థానిక పూలతో తయారు చేసిన బొకేలు అందజేసి, జలహారతులు పట్టి, పూలవర్షం కురిపిస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు. పాఠశాలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ చిన్నారులను పలకరించి వారికి తినుబండారాలు అందించారు. అనంతరం కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముందు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 కింద వాటర్‌షెడ్ అభివృద్ధి పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.68 కోట్ల వ్యయంతో 34 వేల మంది అర్హులైన రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే కార్యక్రమంలో భాగంగా స్థానిక గిరిజన రైతులకు పరికరాలను పంపిణీ చేశారు.