చీర కట్టుకున్నందుకు 'బెహన్‌జీ' అని పిలిచారు: ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి!
సూర్య లైఫ్‌స్టైల్ & సమాజ డెస్క్: ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్‌పర్సన్, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. విమానాశ్రయంలో చీర ధరించినందుకు తనను కొందరు ‘బెహన్‌జీ’ అని పిలిచారని ఆమె వెల్లడించారు.
ఐశ్వర్య హెగ్డేతో జరిగిన సంభాషణలో సుధామూర్తి మాట్లాడుతూ.. "నేను చీర కట్టుకున్నానంటే నాకు ఇంగ్లీష్ రాదని, పరిజ్ఞానం లేదని కొందరు ఊహించుకుంటారు. కానీ నా జ్ఞానానికి, నేను వేసుకునే దుస్తులకు ఎలాంటి సంబంధం లేదు" అని స్పష్టం చేశారు. మన నైపుణ్యాలు, విజ్ఞానం అనేవి బాహ్య రూపంపై ఆధారపడి ఉండవని ఆమె తేల్చిచెప్పారు.
మహిళలు తమ సంప్రదాయ వస్త్రధారణ అయిన చీరలను ధరించి కార్పొరేట్ బోర్డ్‌రూమ్‌లకు కూడా ధైర్యంగా వెళ్లాలని, అలా ఎంతోమంది మహిళలు ముందుకు రావాలని తాను కోరుకుంటున్నట్లు సుధామూర్తి ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఒకరి వేషధారణను బట్టి వారి ప్రతిభను తక్కువగా అంచనా వేసే ధోరణి మారాలని ఆమె పేర్కొన్న వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి.