చెరకు రైతులకు తీపి కబురు..
చెరకు రైతులకు తీపి కబురు..
▪️చెరకు రైతుల బకాయిలు నవంబరు 30 లోగా చెల్లించాలి..
▪️సూదలగుంట షుగర్స్ నిర్వాహకులకు కలెక్టర్ ఆదేశం..
నెల్లూరు, మేజర్ న్యూస్:: నెల్లూరు జిల్లా పొదలకూరు పరిధిలో చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను నవంబరు 30 లోగా రెండు విడతల్లో చెల్లించాలని సూదలగుంట షుగర్స్ యాజమాన్యాన్ని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లో చెరకు రైతులు, సూదలగుంట షుగర్ ఫ్యాక్టరీ యజమాని జయరామ్ చౌదరి తదితరులతో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబరు 30 నాటికి రైతుల బకాయిలను పూర్తిగా చెల్లించాలని ఆదేశించారు. ఎన్ని విడతల్లో, ఎంత మొత్తంలో చెల్లిస్తారో లిఖిత పూర్వకంగా సమర్పించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆదేశించారు. దీనిపై స్పందించిన షుగర్ ఫ్యాక్టరీ యజమాని జయరామ్ చౌదరి.. తొలి విడతగా రూ.15 కోట్లు, రెండవ విడతలో రూ.15 కోట్లు చొప్పున మొత్తం రూ.30 కోట్ల రైతుల బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. ఒకవేళ రెండు నెలల్లో చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే నెల్లూరులోని 50 ఎకరాల భూమి, శ్రీకాళహస్తిలో ఉన్న భూమిని విక్రయించి అయినా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పొదలకూరు షుగర్ ప్లాంట్ ను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జేసీ గోవిందరావు, నెల్లూరు అసిస్టెంట్ కేన్ కమిషనర్ జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.