చట్టం ఏం చెప్పింది? కాకినాడ పిసిబి ఏం చేసింది?
చట్టం ఏం చెప్పింది?.. పీసీబీ ఏం చేసింది?
ఏడు నెలల్లో 266 నోటీసులు.. ఆ తర్వాతి చర్యలపై గోప్యత
తప్పులు సరిదిద్దుకున్న పరిశ్రమలెన్ని?.. తిరిగి తనిఖీ చేసినవెన్ని?
నోటీసుల మాటున రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు చేతులు మారుతున్నాయంటూ ఆరోపణలు
కాకినాడ పీసీబీ కార్యాలయంలో విశాఖ నాన్ అఫీషియల్ మెంబర్ హల్‌చల్
సమాచారం బయటకొస్తే ఉద్యోగాలకే ముప్పంటూ హెచ్చరించినట్లు ప్రచారం
కాలుష్య ఉల్లంఘనలపై కాకినాడ పీసీబీ పరిధిలో ఏడు నెలల్లోనే 266 నోటీసులు ఇచ్చినట్లు అధికారులే వెల్లడించారు. నోటీసులు ఇచ్చారు సరే.. ఆ తర్వాత ఏమైంది? పరిశ్రమలు తప్పులు సరిదిద్దుకున్నాయా?.. అధికారులు మళ్లీ వెళ్లి చూశారా?.. కాలుష్యం తగ్గిందా?.. పరిహారం విధించి వసూలు చేశారా?.. ఇవేవీ బయటకు రావడం లేదు. ఇదే గోప్యత మాటున చిన్న పరిశ్రమల నుంచి రూ.50 వేల వరకు, పెద్ద పరిశ్రమలైతే రూ.10–15 లక్షల వరకు చేతులు మారుతున్నాయన్న తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు విశాఖకు చెందిన ఓ నాన్ అఫీషియల్ మెంబర్ కాకినాడ కార్యాలయానికి వచ్చి సిబ్బందితో వాదించడం, సమాచారం బయటకు వెళ్లొద్దంటూ హెచ్చరించినట్లు ప్రచారం జరగడం మరింత కలకలం రేపుతోంది. నోటీసులు ఇచ్చిన విషయం చెప్పిన పీసీబీ.. వాటిపై చివరకు ఏం చేసిందో కూడా బయటపెడితేనే వాస్తవాలు తేలుతాయి.
ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో
(కాకినాడ)
నోటీసు జారీ చేయడం వరకే విషయం బయటకొస్తోంది.. ఆ తర్వాత ఫైలు ఏ మలుపు తిరిగిందన్నదే తెలియడం లేదు. తప్పు చేసిన పరిశ్రమ వివరణ ఇచ్చిందా?.. దాన్ని అధికారులు అంగీకరించారా?.. క్షేత్రస్థాయిలో లోపాలు సరిచేశారా?.. మళ్లీ తనిఖీ చేసి కాలుష్యం తగ్గిందని నిర్ధారించారా?.. పరిహారం విధించారా?.. వసూలు చేశారా?.. చివరకు ఆ నోటీసు ఏ చర్యతో ముగిసిందన్న వివరాలు ప్రజల ముందుకు రావడం లేదు. నోటీసు ఇచ్చామని చెప్పడమే కాదు.. దానివల్ల కాలుష్యం ఎంతవరకు కట్టడైందో చెప్పినప్పుడే చర్యకు అర్థం ఉంటుంది. ఈ పూర్తి వివరాలను బహిర్గతం చేస్తే పరిశ్రమలపైనా, అధికారులపైనా వస్తున్న అనుమానాలకు సమాధానం దొరుకుతుంది.
ఈసీ, సీటీవోల ఉల్లంఘన.. గోప్యత వీడేనా?
పర్యావరణ, కాలుష్య నియంత్రణ నిబంధనల ఉల్లంఘనలపైనే నోటీసులు జారీ చేస్తారు. మరి ఆ తర్వాత ఆయా పరిశ్రమలు తప్పులు సరిదిద్దుకున్నాయా? అధికారులు మళ్లీ వెళ్లి శాంపిల్స్ తీశారా? కాలుష్యం తగ్గిందా? పర్యావరణ పరిహారం విధించారా? ఎంత వసూలు చేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బోర్డు.. వివరాలను బహిర్గతం చేయకపోవడమే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యం, పర్యావరణంతో ముడిపడిన ఇలాంటి సమాచారాన్ని వీలైనంత వరకు స్వచ్ఛందంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న పారదర్శకత సూత్రాన్ని సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4 ముందుకు తెస్తోంది. మరి పరిశ్రమల వారీగా నోటీసు నుంచి తీసుకున్న చర్య వరకు వెబ్‌సైట్‌లో పెట్టడానికో, నెలవారీగా వెల్లడించడానికో అడ్డేమిటన్న ప్రశ్న ఎదురవుతోంది.
నోటీసుకో రేటు.. భారీగా చేతులు మారాయనే అనుమానాలు!
కాలుష్యాన్ని కట్టడి చేయాల్సిన నోటీసులు కాస్తా బేరసారాలకు అస్త్రాలుగా మారాయనే ఆరోపణలు పరిశ్రమ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. సాధారణ చిన్న తరహా పరిశ్రమలకు నోటీసు వెళ్తే, ఫైలు ముందుకు కదలకుండా ఉండాలంటే కనీసం రూ.50 వేలు సమర్పించుకోవాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు. అదే కెమికల్, ఫార్మా, ఆయిల్ రిఫైనరీల వంటి పెద్ద యూనిట్ల విషయానికొస్తే.. ఉత్పత్తి సామర్థ్యం, ఉల్లంఘన తీవ్రతను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా రేటు పలుకుతోందని టాక్ నడుస్తోంది. ఈ ఆరోపణల్లో నిజమెంతుందో తేలాలంటే 266 నోటీసులపై తీసుకున్న తుది చర్యలను బహిర్గతం చేయాల్సి ఉంది.
నాన్ అఫీషియల్ పెత్తనం.. హెచ్చరికల పర్వం!
విశాఖపట్నంలో పరిశ్రమల కాలుష్యం సమస్యలు గుట్టలుగా పడి ఉండగా.. అక్కడి పనులు వదిలేసి ఆ నాన్ అఫీషియల్ మెంబర్ కాకినాడ వచ్చి పంచాయితీ పెట్టడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో శాశ్వత, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కూర్చోబెట్టి ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. నోటీసుల తాలూకు సమాచారం గానీ, కంపెనీల ఫైళ్లు గానీ ఏ ఒక్కటీ బయటకు వెళ్లడానికి వీల్లేదని, సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా అడిగినా పత్రాలు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరైనా వివరాలు బయటపెడితే ఉద్యోగాలు పీకేస్తామని దబాయించినట్లు సమాచారం. కార్యాలయ సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తే ఆయన రాక, ఎవరితో సమావేశమయ్యారు, అక్కడ జరిగిన పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బోర్డులో నాన్ అఫీషియల్ మెంబర్‌గా ఉన్న వ్యక్తికి నేరుగా ప్రాంతీయ కార్యాలయానికి వచ్చి సిబ్బందిని శాసించే అధికారం ఎవరిచ్చారన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.
పవన్ కళ్యాణ్ శాఖలోనే ఈ తరహా హెచ్చరికలా?
పారదర్శక పాలన, కాలుష్య నియంత్రణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు పలుమార్లు ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలోనే పీసీబీ వ్యవహారాలపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. స్వచ్ఛమైన వాతావరణంలో జీవించే హక్కుతో ముడిపడిన అంశంలో నోటీసులు, వాటిపై తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. కాకినాడ పీసీబీలో 266 నోటీసుల వ్యవహారంతో పాటు నాన్ అఫీషియల్ మెంబర్ కార్యాలయానికి వచ్చి సిబ్బందితో వాదించిన ఘటనపైనా వాస్తవాలు బయటపెట్టాలని, అవసరమైతే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.