మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్ల నిర్మాణం
అనంతపురం బ్యూరో: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూల ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. 20 ఏళ్లుగా పరిష్కారం కాని రోడ్ల సమస్యలకు సైతం పరిష్కారం చూపుతున్నామని తెలిపారు.
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా ఏ.నారాయణపురం పంచాయతీ పరిధిలోని ఏఎస్ఆర్ నగర్‌లో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమిపూజ చేశారు. అనంతరం రాయల్ నగర్‌లో పింఛన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో సుమారు రూ.1,300 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘రైజింగ్ రాయలసీమ’ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మదనపల్లిలో రూ.40 వేల కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులను పీపీపీ విధానంలో తీసుకొస్తున్నామని తెలిపారు. హంద్రీనీవా కాలువను విస్తరించి అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అమృత్ స్కీం కింద రూ.107 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
వచ్చే ఎన్నికల్లో 62 డివిజన్లు, నాలుగు పంచాయతీల్లో విజయం సాధిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పెద్దగా జరగలేదని విమర్శించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవతో రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నారని తెలిపారు.
పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతోందని ఎంపీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నాయని, ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు తాగునీటి సౌకర్యాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.