చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్‌తో కలిసి ఇంటింటి ప్రచారం.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి..
అమలాపురం మేజర్ న్యూస్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో 15వ వార్డు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దండుమోను రూపేష్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. వార్డులోని ప్రజలను నేరుగా కలుసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్‌తో కలిసి 15వ వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా రూపేష్ కుమార్ మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో మున్సిపల్ వార్డుల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ వంటి ప్రజల నిత్యజీవితానికి సంబంధించిన సమస్యలను పట్టించుకోకపోవడంతో వార్డుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుల అభివృద్ధిని పక్కనపెట్టి ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే 15వ వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని రూపేష్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ మెరుగైన మంచినీటి సరఫరా అందేలా కృషి చేయడంతో పాటు, పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడం, వీధి దీపాల సౌకర్యాలను కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వార్డును పరిశుభ్రంగా, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని, వార్డులో అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తానని రూపేష్ కుమార్ స్పష్టం చేశారు.
కూటమి అభ్యర్థుల విజయంతోనే వార్డుల అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుందని పేర్కొంటూ, 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దండుమోను రూపేష్ కుమార్‌కు సైకిల్ గుర్తుపై మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్‌కు గాజు గ్లాసు గుర్తుపైఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లను కలుసుకుంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఈ కార్యక్రమంలో దండుమేను రూపేష్, చిట్టిమెను దత్తాత్రేయలు, దండుమేను అన్నవరం, కోరశిఖ చంటి, చిట్టిమేను సత్తిబాబు, మందపాటి వాసు, కైలా శోభన్ బాబు, కానుబోయిన భాస్కర్, లోవ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు