బోయపేట ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ ఫైరోజ్ బేగం..
శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డీఎం,హెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం బుధవారం హిందూపురం లోని నింకంపల్లి రోడ్డులోని బోయపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (యు.పి.హెచ్.సి) ఆకస్మికంగా సందర్శించారు.ఆరోగ్య కేంద్రంలోని వివిధ విభాగాలను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం ఆవరణ అపరిశుభ్రంగా ఉండటంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వైఫల్యం చెందినందుకు అక్కడ విధులు నిర్వహిస్తున్న స్వీపర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. రోగుల ఆరోగ్యం దృష్ట్యా ఆసుపత్రి వాతావరణం పరిశుభ్రంగా ఉండటం ఎంతో ముఖ్యమని, అటువంటి చోట అపరిశుభ్రతను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సదరు స్వీపర్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆరోగ్య కేంద్రంలోని వివిధ రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డీఎం,హెచ్ఓ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ సమయపాలన పాటించాలని, విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించినా శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అనంతరం లక్ష్మీపురం, ఇందిరానగర్, శ్రీనివాసనగర్, ముదిరెడ్డిపల్లి ఆరోగ్య కేంద్రాలను సందర్శించి రికార్డుల నిర్వహణ, రెఫరల్స్, ప్రసవాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ తనిఖీల్లో ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు హిమబిందు, ఉషారాణి, నవీన్, సివో రమేష్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.