భర్త మద్యానికి బానిసై వేధిస్తున్నాడని వివాహిత ఆత్మహత్య
భర్త మద్యానికి బానిసై వేధిస్తున్నాడని వివాహిత ఆత్మహత్య
రేణిగుంట మేజర్ న్యూస్: భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్‌లో చోటు చేసుకుంది. రేణిగుంట అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం కట్టకిందపల్లి (ఉప్పువడ్డేపల్లి) గ్రామానికి చెందిన కీర్తి (30)కి సోమల మండలం వడ్డీపల్లికి చెందిన సునీల్ కుమార్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్‌లో నివసిస్తోంది. సునీల్ కుమార్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, మద్యానికి బానిసై సంపాదనను మద్యానికే ఖర్చు చేస్తూ కుటుంబ బాధ్యతలను పట్టించుకోవడం లేదని పోలీసుల ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయంపై పెద్దలు పలుమార్లు సర్దిచెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది.ఈ క్రమంలో అక్టోబర్ 8వ తేదీ రాత్రి సునీల్ కుమార్ మద్యం సేవించి ఇంటికి రావడంతో దంపతుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న వేళ కీర్తి ఇంటి బయట వరండాలోని పైకప్పు ఇనుప కడ్డీకి చున్నీతో ఉరివేసుకుంది. అర్ధరాత్రి గంటల సమయంలో కుటుంబ సభ్యులు గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లి ఎం. సులోచన ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని ఆసుపత్రి మార్చురీకి తరలించి, ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు.