భక్తుల రద్దీతో టి టి డి నిర్ణయం
తిరుమల: భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన రద్దీ కారణంగా ఎల్లుండి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడమే కాకుండా, రేపు ఎలాంటి సిఫార్సు లేఖలనూ స్వీకరించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిస్థాయిలో నిండిపోయి, వెలుపలి క్యూలైన్లలో భక్తులు కిక్కిరిసి వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది.
కాగా, నిన్న ఒక్కరోజే 78,445 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 40,098 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ. 4.3 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి సహకరించాలని దేవస్థానం యాజమాన్యం కోరింది.