పంటల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం
ఉద్యాన పంటల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం
-పండ్ల తోటలు, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన
రాప్తాడు మేజర్ న్యూస్ :-
ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించి రైతులకు మెరుగైన ఆదాయం అందించేందుకు ఆధునిక సాగు పద్ధతులను రైతులు అవలంబించాలని ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రాప్తాడు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రైతులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పండ్ల తోటల సాగు, నీటి యాజమాన్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలపై వివరించారు. మదనపల్లెలో నిర్వహించిన “గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్” శంకుస్థాపన కార్యక్రమాన్ని రాప్తాడు మండలంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా ఉద్యాన పంటల సాగులో అనుసరించాల్సిన పద్ధతులు, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే పంటల ఎంపిక, పండ్ల తోటల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.నీటిపారుదల ప్రాజెక్టులు, సాగునీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కూడా చర్చించారు. పండ్ల తోటల ఏర్పాటుకు అవసరమైన సాంకేతిక సలహాలు, పంటల సంరక్షణ, నీటి వినియోగం, ప్రభుత్వ పథకాలపై రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.రైతులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు నాణ్యమైన దిగుబడులు సాధించి ఆదాయాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షుడు గంగలకుంట కిష్టప్ప, మాజీ కన్వీనర్ నారాయణస్వామి, మండల ఉపాధ్యక్షుడు జూటూరు రామకృష్ణతో పాటు ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు దివ్య, కృష్ణ చైతన్య , వ్యవసాయ శాఖ సిబ్బంది,పలువురు రైతులు పాల్గొన్నారు.