భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది పొట్టి శ్రీరాములు త్యాగం అవనిగడ్డలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
అవనిగడ్డ, మేజర్ న్యూస్: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గదర్శకులుగా నిలిచారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ప్రియశిష్యుడైన పొట్టి శ్రీరాములు జీవితాంతం గాంధేయ మార్గంలో పయనించిన అహింసావాది అని కొనియాడారు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే సంకల్పంతో 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి అని పేర్కొన్నారు. ఆయన త్యాగం దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిందన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ యలవర్తి రాజ నాగ మునేశ్వరరావు, కోడూరు మండల జనసేన నాయకుడు రెడ్రౌతు కృష్ణబాబు, నీటి సంఘ అధ్యక్షుడు రేపల్లె రవీంద్ర, పార్టీ నాయకులు భూపతి అశోక్, వాహేదుల్లా తదితరులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.