బాలికల భద్రత, డ్రగ్స్, సోషల్ మీడియా మోసాలపై అవగాహన
అనంతపురంబ్యూరో : ఆల్ ఇండియా స్టూడెంట్స్ పవర్ (AISP) ఆధ్వర్యంలో కదిరి జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికల భద్రత, మాదక ద్రవ్యాల నివారణ, ర్యాగింగ్, సోషల్ మీడియా మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. AISP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టౌన్ ఎస్ఐ ధనుంజయ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి చిన్నికృష్ణ, పాఠశాల హెచ్ఎం వెంకటచలం, ఇన్‌చార్జి నరసమ్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ బాలికలు వేధింపులకు గురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డ్రగ్స్, ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని విద్యాశాఖ అధికారి చిన్నికృష్ణ, హెచ్ఎం వెంకటచలం సూచించారు.
AISP రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ మాట్లాడుతూ విద్యార్థుల్లో భద్రత, సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, AISP కదిరి నియోజకవర్గ కార్యదర్శి అభి, విద్యార్థినులు పాల్గొన్నారు.