అయోడిన్ ఉప్పుతోనే సంపూర్ణ ఆరోగ్యం
శ్రీకాకుళం, సూర్య : శరీరంలో అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ సమస్యలతో పాటు పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల లోపిస్తుందని, ప్రతి ఒక్కరూ అయోడైజ్డ్ ఉప్పునే వాడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) నరేష్ కుమార్ స్పష్టం చేశారు. జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంలో భాగంగా బుధవారం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా గర్భిణులు, ఎదుగుతున్న పిల్లలకు అయోడిన్ ఎంతో కీలకమని, దీని లోపం వల్ల గొంతు వాపు (గాయిటర్) వంటి తీవ్ర రుగ్మతలు వస్తాయని హెచ్చరించారు. ఉప్పుకు తేమ తగలకుండా మూత ఉన్న పాత్రల్లో భద్రపరచాలని, వంట పూర్తయ్యే చివరి దశలోనే ఉప్పును కలపాలని గృహిణులకు సూచించారు.
ఈ నెల ఇరవై ఏడు వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయోడిన్ లోప రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యాలయ ప్రాంగణం నుంచి చేపట్టిన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ గురుమూర్తి, డిప్యూటీ హెచ్ఈవో మోహిని రత్నకుమారి, ఎన్‌సీడీ సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.