ఆత్మకూరు మున్సిపాలిటీ ఏ గ్రేడ్ గా తీర్చిదిద్దుతా --ఆత్మకూరు నియోజకవర్గంను అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచుతా
విద్యా,ఆధ్యాత్మిక కేంద్రంకానున్న అభయాంజనేయ సెంటర్ - ఆకర్షణీయంగా మారనున్న బైపాస్ రోడ్డు
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : ఆత్మకూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచి ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని, ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆయన శాసనసభ్యులుగా ఆత్మకూరు నుంచి ఎన్నికై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పదవి చేపట్టిన ఈ రెండేళ్ల కాలంలో ఆత్మకూరు మున్సిపాలిటీకి, నియోజకవర్గానికి సాధించిన అభివృద్ధి పరిష్కరించిన సమస్యలు, నిధుల మంజూరు భవిష్యత్ కార్యాచరణ గురించి రామనారాయణ రెడ్డి వెల్లడించారు. గతంలో రామనారాయణరెడ్డి ఆత్మకూరు శాసనసభ్యులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరుకు రెండు కోట్ల రూపాయలతో క్రీడా స్టేడియంను మంజూరు చేయించగా దాదాపు కోటి రూపాయలు పని జరిగింది. అనంతరం గత పదేళ్లుగా స్టేడియం గురించి ఎవరూ పట్టించుకోలేదు. పరిశీలించిన రామ నారాయణరెడ్డి మరో కోటి 78 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి అందుకు సంబంధించిన విషయమై బుధవారం నిర్మాణంలో ఉన్న స్టేడియం పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో అక్కడే జరగనున్న పనులు గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరు పాలెం నుండి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వరకు నాలుగు లైన్ల రహదారి ఏర్పాటు చేయించి డివైడర్లు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించానన్నారు. ప్రస్తుతం నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద నుండి పట్టణంలోకి వెళ్లే బైపాస్ రోడ్డు ను దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని,ఈ నెలాఖరు కే పనులు పూర్తయ్యే పరిస్థితి ఉందని, నాలుగు లైన్ల రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగు, డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు అధికంగా వాకింగ్ చేసేవారి కోసం ప్రత్యేక ట్రాక్ లను కూడా ఏర్పాటు చేయించనున్నామని రామ నారాయణ రెడ్డి వెల్లడించారు. స్టేడియం కోసం 2017లో తాను రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించి 10 ఎకరాలు స్థలం కేటాయించామని, పనులు నిలిచిపోయినందున మళ్లీ తాను శాప్ చైర్మన్ తో, సంబంధిత క్రీడా శాఖ మంత్రితో చర్చించి మరో ఒక కోటి 75 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించడంతోపాటు దానికి ఆర్డీవో, తాసిల్దార్ తో చర్చించి మరో 10 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించామని, అందరు క్రీడాకారులకు యువతకు అత్యంత ఉపయోగంగా ఉంటుందని పేర్కొంటూ నెల్లూరులో స్టేడియం 17 ఎకరాల్లోనే ఉండగా అంతకన్నా పెద్ద స్టేడియం ఆత్మకూరులో నిర్మాణం కానుందని పేర్కొన్నారు. ఆత్మకూరు మున్సిపల్ అభివృద్ధికి అనేక విధాలుగా నిధులు సాధించామని, కొన్ని పనులు పూర్తయ్యాయని, మరికొన్ని త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొంటూ మున్సిపల్ అభివృద్ధికి సంబంధించి ఆత్మకూరులో ఒక ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి భాగస్వామి పార్టీలతో పాటు అన్ని పార్టీలను కూడా ఆహ్వానించి చర్చించి సమీక్షిస్తామని రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఆత్మకూరు జనాభా తక్కువగా ఉన్నా తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా అంతకుముందు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ కృషి చేసి పంచాయతి గా ఆత్మకూరును మున్సిపాలిటీగా మార్పించానని, ఆత్మకూరుకు ఆర్డిఓ కార్యాలయాన్ని జిల్లా హాస్పిటల్ ను కూడా మంజూరు చేయించానని, పెన్నానదిపై అతిపెద్ద వంతెన, పలు వంతెనలు, రోడ్లు, భవనాలు మంజూరు చేయించానని,విద్యాపరంగా ప్రభుత్వ పాలిటెక్నిక్, ఎస్సీ,బీసీ గురుకుల పాఠశాలలు, ఐ టి ఐ లు, వ్యవసాయ పాలిటెక్నిక్,మోడల్ స్కూల్స్,కస్తూర్బా స్కూల్స్ తదితరాలను మంజూరు చేయించి విద్యా అవకాశాలను మరింతగా పెంపొందించామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బైపాస్ రోడ్డు సర్వాంగ సుందరంగా నిర్మాణం జరుగుతున్నందున ఆత్మకూరు పట్టణానికి గతంలో వేసిన నెల్లూరు పాలెం రోడ్డు,నేడు వేస్తున్న బైపాస్ రోడ్డు నాలుగు లైన్ల రహదారులుగా సెంట్రల్ లైటింగ్ డివైడర్లతో ఆకర్షణీయంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో ఆత్మకూరులో 100 ఎకరాలతో నగరవనం ఏర్పాటుకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా పనులు ప్రారంభమయ్యాయని ఆయన పేర్కొన్నారు. బీసీ బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాల గా అప్ గ్రేడ్ చేయించామని కూడా ఆయన పేర్కొంటూ అందుకు సంబంధించి ఒక భవనంతో పాటు ఏడు ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించామన్నారు. ప్రజల సౌకర్యార్థం నాగులపాడు నుండి ఆత్మకూరు టిడ్కో గృహాల సమీపము ద్వారా నర్సాపురం మీదుగా వాసిలి వరకు రోడ్డు నిర్మించేలా ఏర్పాటు అందుకు నిధులు మంజూరు చేయించానని ఆయన పేర్కొన్నారు. పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెడుతున్న ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ను గత ప్రభుత్వం మూసివేయగా తాము మళ్ళీ పునరుద్ధరించామని, స్టేడియం సమీపంలో 16, మెట్రిక్ టన్నుల చెత్తాచెదారం వేసి ఉండగా అందుకు పది ఎకరాల స్థలాన్ని కేటాయించి డంపింగ్ యార్డ్ రెండు కోట్ల రూపాయలతో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసి రెండు కోట్లతో అభివృద్ధి పరిచి చెత్తాచెదారాన్ని అక్కడికి తరలించామని ఆయన పేర్కొన్నారు. వాసిలి చెరువు వద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు 10 లక్షలతో టెండర్ పూర్తి అయిందని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు సాధిస్తున్నామని గతంలో దాదాపు 50 కోట్ల రూపాయలతో ఆత్మకూరు పట్టణానికి త్రాగునీరు అందించే ప్రభుత్వ పథకాన్ని మంజూరు చేయించగా జనాభాపెరుగుదలతో ప్రతిరోజు సక్రమంగా త్రాగునీరు అందని పరిస్థితి గమనించి అమృత టు పథకం ద్వారా మరో 9.3 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని మంజూరు చేయించామని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరు చెరువు పునరుద్ధరణకు 16 కోట్ల రూపాయలతో ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. తాను మంజూరు చేయించిన ఆర్అండ్ బి అతిథి గృహం పనులు నిలిచిపోయి పదేళ్లుగా నిర్లక్ష్యాన్ని గురికాగా తాను పరిశీలించి 75 లక్ష రూపాయలు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించి ప్రారంభించామన్నారు. టిడ్కో గృహాల్లో ప్రజల సౌకర్యార్థం 50 లక్షలు రూపాయలతో ఒక రామాలయాన్ని మంజూరు చేయించి నిర్మాణం పూర్తయిందని, అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఎనిమిది కోట్ల రూపాయలతో ఒక కళ్యాణ మండపం నిర్మించనున్నామని, దాంతోపాటు శ్రీ పెనుశిల నరసింహస్వామి దేవాలయాన్ని కూడా నిర్మించనున్నామని ఆయన పేర్కొన్నారు. ఆత్మకూరులో పలు మౌళిక వసతులు కోసం రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించామని పనులు పూర్తయ్యాయని, అర్బన్ ఛాలెంజింగ్ కార్యక్రమం ద్వారా మరో 28 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించామని, దాంతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ లు,పార్కులు తదితరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.తాజాగా మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులకు 32కోట్లు మంజూరు చేయించామని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని మంత్రి ఆనం తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నేరుగా మూడు దఫాలు ఆత్మకూరు నియోజకవర్గానికి రప్పించి సోమశిల ప్రాజెక్టు పనులు ప్రారంభించామని, ఎంఎంఎస్ఈ పార్కును ప్రారంభించామని, శాంతినగర్ వద్ద 1.5 కోట్ల రూపాయలతో ఆటోనగర్ ఏర్పాటు చేయనున్నామని, ఆటో కార్మికులకు అక్కడే నివాస స్థలాలు కూడా కేటాయిస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా నిధులు మంజూరు చేయించి గ్రామాల్లో వందలాది కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయించామని, మరో విడత కూడా సిమెంట్ రోడ్లు కొరకు నిధులు మంజూరు చేయించానున్నామని, ఆత్మకూరులో గతంలో ప్రాంతీయ వైద్యశాలగా తాను మంజూరు చేయించి అనంతరం జిల్లా హాస్పిటల్ గా మార్పించి ఆ హాస్పిటల్లో అభివృద్ధి పరిచేందుకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు త్వరలోనే అన్నీ సమకూర్చేలా కృషి చేస్తున్నామన్నారు. మరో మూడేళ్ల కూటమి ప్రభుత్వపాలన ఉంటుందని, ఆత్మకూరు మున్సిపాలిటీకి ప్రత్యేకంగా నిధులు సాధించి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సహకారంతో ఆత్మకూరు మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని దాంతో పాటు ఆత్మకూరు నియోజకవర్గంను కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు చేస్తున్నామని అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శాయశక్తుల కృషి చేస్తానని రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి వివరాలు తెలుసుకుంటున్న నేతలు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఆత్మకూరు మున్సిపల్ ప్రజలు నాడు నేడు అభివృద్ధి అంటే ఆనం, ఆనం అంటే ఆత్మకూరు అభివృద్ధి,వేలాది కోట్ల రూపాయల నిధులు సాధించి అభివృద్ధిని పరుగులు తీయించగల సమర్థత కలిగిన నాయకుడు ఆనం రామ నారాయణ రెడ్డి అని సర్వత్రా కొనియాడుతున్నారు.