అసంపూర్తి రోడ్డు అతివేగంతో దూసుకెళ్తున్న వాహనాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న పి కొత్తకోట వాసులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆవేదన
పూతలపట్టు మేజర్ న్యూస్ :
మండలం పి కొత్తకోట ప్రాంతంలో ప్రయాణం అంటేనే స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు చవటపల్లి గ్రామం ముందర బెంగళూరు నాయుడు పేట జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు లో వాటర్ ట్యాంక్ సమీపంలో రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణం నిత్యనరకంగా మారిందని స్థానికలు అధికారులపై మండిపడుతున్నారు రోడ్డు పనులు పూర్తి కాకపోవడం ఒక ఎత్తైతే, కనీస హెచ్చరిక బోర్డులు లేదా వేగ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయకపోవడం మరో పెద్ద సమస్యగా పరిణమించింది. ఫలితంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర భారీ వాహనాలు ఎలాంటి అడ్డులేకుండా అత్యంత వేగంగా దూసుకెళ్తున్నాయి రోడ్డు పక్కనే జనసంచారం అధికంగా ఉండే నివాస ప్రాంతం కావడంతో ఇక్కడి పరిస్థితులు క్షణక్షణానికి ఆందోళనకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు ఈ రోడ్డు దాటాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలన్నా జంకుతున్నామని, రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల అతివేగం చూస్తుంటే ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తిగా వదిలేసిన ఈ రోడ్డు పనులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పునఃప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రోడ్డు పనులు పూర్తిగా పూర్తయి రాకపోకలకు అనుకూలంగా మారేంత వరకు, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ నేపథ్యంలో పంచాయతీ యంత్రాంగం, సంబంధిత యన్ హెచ్ ఐ అధికారులు వెంటనే స్పందించి, ఈ మార్గంలో అత్యవసరంగా స్పీడ్ బ్రేకర్లు (వేగ నిరోధకాలు) ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా భయానకంగా మారిన ఈ తీవ్రమైన సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పూతలపట్టు రిపోర్టర్ దిలీప్ కుమార్