అప్పుల బాధతో జలాశయంలో దూకి వ్యక్తి మృతి....
*రెండు రోజుల గాలింపు తర్వాత లభ్యమైన మృతదేహం...
పాచిపెంట, సెప్టెంబర్ 28, మేజర్ న్యూస్:
ఒకవైపు తండ్రి పెద్దకర్మ.. మరోవైపు కుటుంబ పెద్ద ఇక లేడన్న విషాదం.. అప్పుల బాధతో ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన చిత్త వీర్రాజు (44) ఆదివారం పెద్దగెడ్డ జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి అప్పుల పాలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు.
వీర్రాజు జలాశయంలో దూకిన విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌ఐ లాలం అర్జున్ నేతృత్వంలో స్థానిక గజ ఈతగాళ్లతో ఆదివారం నుంచి రెండు రోజులపాటు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం గాలానికి మృతదేహం తగలడంతో వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
*తండ్రి పెద్దకర్మ రోజే విషాదం..
వీర్రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు గతేడాది వివాహం జరిపించారు. కుమారుడు అగ్నివీర్‌కు ఎంపికై ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబాన్ని నిలబెట్టిన వ్యక్తి ఇలా అర్ధంతరంగా దూరం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదే సమయంలో సోమవారం వీర్రాజు తండ్రి పెద్దకర్మ జరగడం మరింత విషాదాన్ని నింపింది. ఒకవైపు తండ్రికి పెద్దకర్మ నిర్వహిస్తుండగానే.. మరోవైపు కుమారుడి మృతదేహం లభించడం గ్రామస్తులను కలచివేసింది. ఈ ఘటనతో కొత్తవలస గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.