అపరిశుభ్రంగా కార్యాలయ ప్రాంగణాలు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నగరంలోని కొత్త జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పిచ్చి మొక్కలు పెరిగిపోయి అద్వానంగా ఉంది. ఈ ప్రాంగణంలో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్, డ్వామా కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ పచ్చదనంతో ఎంతో సుందరంగా ఉండవలసిన ఈ ప్రాంగణాలు పిచ్చి మొక్కలు నిండిపోయి దుర్భరంగా ఉన్నాయి. ముఖ్యంగా పంచాయతీరాజ్ కార్యాలయం చుట్టూ ఎటు చూసినా పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఈ ప్రాంతంలో రాత్రిపూట లైట్ కూడా వెలగని పరిస్థితి అని పలువురు అంటున్నారు. ఈ ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చే ఉద్యోగులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విష సర్పాలు సంచరించే విధంగా పిచ్చి మొక్కలతో నిండిపోయి రోడ్లంతా దుర్భరంగా మారాయి. ఈ ప్రాంగణం విశాలంగా ఉన్నప్పటికీ కనీసం ఒక్కొక్కరు ఒక్క మొక్క నాటిన ఈ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడే అవకాశం ఉంది. అయితే కొందరు ఉద్యోగులు తమకు ఎందుకులే వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా ఈ విధంగా పిచ్చి మొక్కలు ఉన్నప్పటికీ వాటిని తొలగించే చర్యలు చేపట్టకపోవడం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో పనులు కల్పించే పంచాయతీరాజ్ కానీ, ప్రజలు వలసలు పోకుండా నివారించేందుకు ఉన్న డ్వామా కార్యాలయం అధికారులు గానీ ఈ విధంగా పిచ్చి మొక్కలు దుర్భరమైన రోడ్లు ఉన్నప్పటికీ వాటిని తొలగించి ఆ ప్రాంగణాలు సుందరంగా ఉండే విధంగా రోడ్లు ఏర్పాటు చేసి రోడ్డుకి ఇరువైపులా పచ్చదనం నింపే విధంగా చేయవలసి ఉన్నప్పటికీ అలాంటివేమీ ఈ ప్రాంతంలో కనబడకపోవడం గమనార్హం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్, స్వచ్ఛా ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని చెబుతున్నప్పటికీ, ఇక్కడ అధికారులు మాత్రం పరిసరాలు పరిశుభ్రత పై దృష్టి పెట్టకపోవడం విశేషం. ఇకనైనా జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ ఈ ప్రాంగణంలో తనిఖీ చేసి ఈ ప్రాంతం సుందరంగా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.