ఏపీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్‌కు సిట్ నోటీసులు!
సూర్య అమరావతి బ్యూరో: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న భారీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ యాదవ్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా పనిచేసిన ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
నోటీసుల నేపథ్యం – విచారణ అంశాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన, డిస్టిలరీలకు ఆర్డర్ల కేటాయింపు, బెవరేజెస్ కార్పొరేషన్ కార్యకలాపాల సమయంలో వివేక్ యాదవ్ ఎక్సైజ్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు:ఒత్తిళ్లను ఎదిరించినట్లు వాంగ్మూలాలు:మద్యం పాలసీ అమలు సమయంలో ఉన్నతాధికారులు, రాజకీయ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చినప్పటికీ, అడ్డగోలు నిర్ణయాలు కలిగిన ఫైళ్లపై వివేక్ యాదవ్ సంతకాలు చేయడానికి నిరాకరించినట్లు గతంలో పలువురు నిందితుల వాంగ్మూలాల ద్వారా వెల్లడైంది.
నిర్ణయాలు తీసుకున్నది ఎవరు?:వివేక్ యాదవ్ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ప్రాథమికంగా తెలిసినప్పటికీ.. ఆ సమయంలో ప్రభుత్వంలో నిబంధనలను ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకున్నది ఎవరు? విధానపరమైన ఫైళ్లను ఎలా దారిమళ్లించారు? ఎవరి ఆదేశాల మేరకు మద్యం సరఫరాలో అక్రమాలు జరిగాయి? అనే విషయాలపై ఆయన సాక్ష్యాన్ని, అధికారిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి సిట్ నోటీసులు అందజేసింది.
కార్యాలయంలోనే విచారణ:
సిట్ జారీ చేసిన నోటీసులకు స్పందిస్తూ విచారణకు సహకరించేందుకు వివేక్ యాదవ్ సిద్ధమైనట్లు, శనివారం ఆయన అధికారిక కార్యాలయంలోనే సిట్ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నట్లు సమాచారం.
మరింత బిగుస్తున్న సిట్ ఉచ్చు :ఇప్పటికే ఈ కుంభకోణానికి సంబంధించి మాజీ ఐఏఎస్ రజత్ భార్గవను ప్రశ్నించడంతో పాటు నిందితులుగా ఉన్న కీలక నేతలు, మధ్యవర్తులపై సిట్ అనుబంధ చార్జ్‌షీట్లను కోర్టులో దాఖలు చేసింది. తాజాగా నాటి ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ అందించే వాంగ్మూలం ఈ కేసులోని అంతిమ సూత్రధారులను చట్టపరంగా బోనులో నిలబెట్టేందుకు అత్యంత కీలక సాక్ష్యంగా మారనుందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.