అంతఃశుచితోనే సంపూర్ణ మానవ వికాసం
విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : మానసిక పరిశుభ్రత, భావోద్వేగ సమతుల్యత, ఆధ్యాత్మిక అవగాహనలతోనే సంపూర్ణ మానవ వికాసం సాధ్యమవుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏ ఐ ఐ ఎల్ ఎస్ జి కేంద్రంలో ఆసావేరి సెంటర్ ఫర్ ఇండిక్ నాలెడ్జ్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో ఇన్నర్ శానిటేషన్ అంతఃశుచి అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణవ ఆశ్రమ వ్యవస్థాపకురాలు స్వామిని సుమిత్రానంద సరస్వతి మాట్లాడుతూ మనిషి బాహ్య పరిశుభ్రతతో పాటు అంతర్గత పరిశుద్ధతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఆలోచనలు, భావాలు, సంకల్పాలు పవిత్రంగా ఉన్నప్పుడే నిజమైన ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతుందన్నారు. అసూయ, ద్వేషం, అహంకారం, కోపం వంటి ప్రతికూల భావాలను అధిగమించి ప్రేమ, కరుణ, వినయం, సహనాన్ని పెంపొందించుకోవడమే అంతఃశుచి అసలైన పరమార్థమని వివరించారు.
డాక్టర్ తేజస్విని కట్రవులపల్లి మాట్లాడుతూ ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానంతో సమన్వయం చేయడం ద్వారా మానవ చైతన్యం, మానసిక ప్రశాంతత, వ్యక్తిత్వ వికాసంపై లోతైన అవగాహన పెంపొందించుకోవచ్చన్నారు. శాస్త్రీయ దృక్పథం, ఆధ్యాత్మిక చింతన పరస్పర విరుద్ధాలు కావని, మానవ సంక్షేమానికి రెండూ దోహదపడతాయని పేర్కొన్నారు.
ఆసావేరి సెంటర్ ఫర్ ఇండిక్ నాలెడ్జ్ సిస్టమ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ మాట్లాడుతూ శారీరక పరిశుభ్రత ఎంత అవసరమో మానసిక పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రతిరోజూ పరిసరాలను శుభ్రపరచుకున్నట్లే మనసులో పేరుకుపోయిన భయం, ఆందోళన, అసూయ, ద్వేషం, అహంకారం, మూఢనమ్మకాలను తొలగించుకోవాలని సూచించారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాల్లోని అంతఃశుచి భావనను ఆధునిక భావోద్వేగ మేధస్సు, స్వీయ నిర్వహణ, వ్యక్తిత్వ వికాసంతో అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు. ‘బాహ్య శుచితో ఆరోగ్యం, అంతఃశుచితో ఆనందం, ఆత్మపరిశీలనతో ప్రశాంతత లభిస్తాయి’ అని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రాంతీయ సంచాలకులు బేరేందర్ సింగ్ ఫర్త్యాల్ మాట్లాడుతూ వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన బాధ్యతలు, ప్రజాసేవ, సామాజిక సంబంధాల్లో నైతిక విలువలు, భావోద్వేగ నియంత్రణ, క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో అంతర్గత పరిశుభ్రత, స్వీయ అవగాహన, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక క్రమశిక్షణ, సమగ్ర వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై చర్చించారు. భారతీయ జ్ఞాన వ్యవస్థలను ఆధునిక జీవితానికి అన్వయిస్తూ మానవీయ విలువలు, భావోద్వేగ విద్య, ఆధ్యాత్మిక అవగాహనను ప్రోత్సహించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
రిపోర్టర్ : సత్యనారాయణ, ఏయూ, విశాఖపట్నం.