అంగన్‌వాడీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణ – చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
రాజాం, సూర్య : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పిల్లల సమగ్ర అభివృద్ధికి అంగన్‌వాడీ కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి సూచించారు.రాజాం ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు పోషణ్ భీ – పఢాయీ భీ కార్యక్రమంలో భాగంగా ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య అంశంపై ఏఐ స్క్రీన్ ద్వారా ప్రత్యేక శిక్షణ,అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లల జీవితంలో మొదటి ఆరు సంవత్సరాలు అత్యంత కీలకమైనవని, ఈ వయస్సులో సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రేమానురాగాలతో పాటు ఆటపాటల ద్వారా విద్య అందించడం ఎంతో అవసరమని తెలిపారు. పిల్లల్లో శారీరక, మానసిక, భాషా, సామాజిక, భావోద్వేగ మరియు సృజనాత్మక అభివృద్ధిని పెంపొందించేలా అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజువారీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.అంగన్‌వాడీ కార్యకర్తలు పిల్లల్లో పోషకాహార లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వారి ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పిల్లలకు నాణ్యమైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్య అందేలా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తలు తమ విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించి, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు మహిళా, శిశు సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజాం ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.