BREAKING
కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి.. అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసనలు. ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ దశాబ్దం తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న ఇమ్రాన్ ఖాన్.. డిసెంబర్‌లో సినిమా విడుదల! ఓటీటీ రిలీజ్ కోసం నాని సినిమా రీ-ఎడిట్?.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! మెక్సికో తీరం వెంబడి దూసుకొస్తున్న 'సైమన్' తుఫాను అమ్మవారిశాలలో 11 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ ఆందోళన చేస్తున్న వారి అక్రమ అరెస్టులను ఖండించండి ఎల్‌నినో పరిస్థితులపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శ్రీకారం

ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, విశ్రాంత సైనిక వీరుడి కల నెరవేర్చాలి: ప్రజల నినాదం

Select Suryaa Now
ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి, విశ్రాంత సైనిక వీరుడి కల నెరవేర్చాలి: ప్రజల నినాదం

మాతృభూమి రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన ఒక సైనికుడు.. తన జీవితకాల సంపాదన అంతటినీ దైవకార్యం కోసం సమర్పించి నిరుపమానమైన భక్తిని చాటుకున్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం, ఎండ్లూరు గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ కొండ్రు రాము చూపిన భక్తి ప్రపత్తులు ఈ తరం సమాజానికి ఆదర్శంగా నిలిచాయి.
సరిహద్దుల్లో రక్షణ.. స్వగ్రామంలో దైవ చింతన
1971-72 బంగ్లాదేశ్ విముక్తి యుద్దంలో ఎనిమిది నెలల పాటు శత్రువులతో వీరోచితంగా పోరాడిన భారత సైనిక వీరుడు కొండ్రు రాము. అనంతరం చైనా సరిహద్దుల్లోని తవాంగ్ ప్రాంతంలో రెండేళ్ల పాటు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ సేవ అందించారు. సైన్యం నుంచి తిరిగి వచ్చాక ప్రభుత్వ శాఖలో డ్రైవర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు.
తమ ఊరిలోనే శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య ఆలయం ఉండాలని, స్వామివారికి నిత్య కైంకర్యాలు జరగాలనే తపనతో, తనకున్న యావదాస్తిని అమ్మగా వచ్చిన డబ్బును మరియు దానిపై కూడిన వడ్డీ కాసులను కలిపి మొత్తం రూ. 75 లక్షల భారీ విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవాణి ట్రస్ట్‌కు సమర్పించారు. 2022లో తిరుమల వెళ్లి యూనియన్ బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ (నెంబర్ 4658296) ద్వారా అప్పటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు ఈ మొత్తాన్ని అందించారు. ఈ త్యాగాన్ని చూసి నాటి పత్రికలు ఆయనను "అభినవ రాముదాసు"గా కొనియాడాయి.
ఆగిన నిర్మాణం.. కన్నీరు మున్నీరవుతున్న భక్తి
కొండ్రు రాము భక్తిని, అభ్యర్థనను మన్నించిన టీటీడీ అధికారులు మరో 75 లక్షల పైచిలుకు 'మ్యాజిక్ గ్రాంట్' కేటాయించి ఎండ్లూరు గ్రామకంఠం స్థలంలో 19-07-2023న భూమిపూజతో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. టీటీడీ ఆమోదిత కాంట్రాక్టర్ ద్వారా దాదాపు 70 శాతం పనులు వేగంగా పూర్తయ్యాయి.
అయితే, 2024 ఆగస్టు నాటికి నిర్మాణ పనులు హఠాత్తుగా నిలిచిపోయాయి. గత 25 నెలలుగా పనులు పూర్తిగా ఆగిపోవడంతో ఆలయ ప్రాంగణం చుట్టూ చిల్లచెట్లు మొలిచి, అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారే ప్రమాదం ఏర్పడింది. టీటీడీ అందించిన మూడు నమూనాల ప్రకారం ఆలయంతో పాటు ఎంట్రెన్స్ ఆర్చ్, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు కూడా పూర్తి కావాల్సి ఉంది. లక్షలాది రూపాయల నిర్మాణ సామగ్రి దొంగల పాలవుతుందనే భయం స్థానికుల్లో నెలకొంది.
అధికారులు, పాలకుల తలుపు తట్టిన అభినవ రాముదాసు
ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి కొండ్రు రాము ఐదారుసార్లు తిరుమల వెళ్లి టీటీడీ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అలాగే ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలకు, ఒంగోలు ఎంపీకి, జిల్లా కలెక్టర్ గారికి, చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితర ప్రజాప్రతినిధులకు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. నాయకుల నుంచి హామీలు వస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం పునరుద్ధరణకు నోచుకోలేదు.
"స్వామివారు ఇచ్చిన ఆస్తిని మళ్లీ స్వామివారి సేవకే సమర్పించాను. ఆలయాన్ని పూర్తి చేసి స్వామివారి నిత్య పూజలు కళ్లారా చూడటమే నా చివరి కోరిక. ఈ బాధ్యత టిటిడి అధికారులపైనే ఉంది." — కొండ్రు రాము (విశ్రాంత సైనికుడు)
మరో తిరుమలగా భాసిల్లే దివ్యక్షేత్రం!
ఆలయాన్ని సందర్శించిన శ్రీ గిరి ప్రదక్షణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా జంధ్యం మాట్లాడుతూ — "మిగిలిన 30 శాతం పనులను పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ స్థాపన, నిత్య పూజలు ప్రారంభిస్తే చుట్టుపక్కల గ్రామాలు, నగరాల నుంచి వేలాదిమంది భక్తులు విచ్చేసి ఇది మరో దివ్య తిరుమలగా వెలుగొందుతుంది. రాష్ట్రంలో 50 వేల దేవాలయాలను నిర్మిస్తామని ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఇలా అసంపూర్తిగా ఉన్న ఆలయ నిర్మాణాన్ని కూడా వెంటనే పూర్తి చేయించాలి" అని విజ్ఞప్తి చేశారు.
పాలకులు, టీటీడీ అధికారులకు విన్నపం:
దేశం కోసం రక్తం చిందించి, స్వామివారి కోసం తన జీవిత కాల సంపాదననంతా ధారపోసిన ఒక వయోవృద్ధ సైనికుడి పవిత్ర సంకల్పాన్ని గౌరవించడం మనందరి బాధ్యత. 70 శాతం పూర్తయిన ఈ పుణ్యక్షేత్రాన్ని అసంపూర్తిగా వదిలేయడం ధర్మానికి తగదు. టీటీడీ పాలకమండలి, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన 30 శాతం పనులను పూర్తి చేసి, శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టకు మార్గం సుగమం చేయాలని ప్రజలు మరియు భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.