8 ఏళ్లుగా అదృశ్యమైన వివాహిత మహిళ ఆచూకీ గుర్తింపు
శ్రీకాళహస్తిలో సురక్షితంగా గుర్తించిన పోలీసులు -ఏ హెచ్ టి యు, మహిళా పోలీస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసలు
నెల్లూరు, అర్బన్/క్రైమ్ (మేజర్ న్యూస్) : ఎనిమిదేళ్లుగా అదృశ్యంగా ఉన్న ఒక వివాహిత మహిళను ఎట్టకేలకు పోలీసులు గుర్తించి సురక్షితంగా తీసుకురావడంలో విజయం సాధించారు. మహిళల అదృశ్య కేసులను ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న జిల్లాపోలీసుల చర్యల్లో భాగంగా ఈ కీలక పురోగతి సాధ్యమైంది.నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నం.596/2018 ‘ఉమెన్ మిస్సింగ్’ కేసులో అదృశ్యమైన దెవెళ్ల లక్ష్మి (39), భర్త చంద్రశేఖర్, సౌత్ రాజుపాలెం గ్రామం (నెల్లూరు రూరల్ మండలం)కు చెందినవారిగా గుర్తించారు. ఆమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కేసర గ్రామం.ఈ కేసును దీర్ఘకాలంగా అన్వేషిస్తున్న ఏ హెచ్ టి యు (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్) నెల్లూరు బృందం, మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ పరిసరాల్లో 03 అక్టోబర్ 2026న ఆమెను సురక్షితంగా గుర్తించారు.గుర్తించిన అనంతరం అవసరమైన చట్టపరమైన ప్రక్రియల కోసం ఆమెను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళల అదృశ్య కేసుల్లో సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం సమన్వయం చేస్తూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులకూ పరిష్కారం కనుగొనే దిశగా ఏ హెచ్ టి యు బృందాలు కృషి కొనసాగిస్తున్నాయని మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పి వేమారెడ్డి తెలియజేశారు.ఎనిమిదేళ్ల తర్వాత మహిళను సురక్షితంగా గుర్తించిన ఏ హెచ్ టి యు బృందాలను మరియు మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల అభినందించారు.