4.5 కిలోల చిన్నారికి విజయవంతంగా గుండె శస్త్రచికిత్స
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : నెల్లూరులోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో తొలిసారిగా 4.5 కిలోల బరువున్న ఐదు నెలల పసికందుకు అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలానికి చెందిన శ్రీహరి కుమారుడైన ఐదు నెలల బాబు పుట్టుకతోనే ‘పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్’ అనే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. కేవలం 4.5 కిలోల బరువు మాత్రమే ఉన్న ఈ చిన్నారి పరిస్థితిని గుర్తించిన కిమ్స్ కడల్స్ వైద్య బృందం, ‘సర్జికల్ లిగేషన్’ ప్రక్రియ ద్వారా సంక్లిష్ట శస్త్రచికిత్సను సమర్థవంతంగా పూర్తి చేసింది. సర్జరీ అనంతరం బాబును పీఐసీయూ విభాగంలో ఉంచి ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందించగా, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్డియాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ సి.ఎస్. శ్రీనివాస రాజు, చీఫ్ అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ శేషయ్య తదితరులు మాట్లాడారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు, డైరెక్టర్ అద్విక్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సీఓఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వంచి, యూనిట్ సీఓఓ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.