2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి
2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి
ఉషశ్రీ గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బుద్ధ ప్రసాద్
అవనిగడ్డ, అక్టోబర్: ఉషశ్రీ గారి శతజయంతి ఉత్సవాల నిర్వహణకు సహకరించమని కోరడానికి అక్టోబర్ 11న ఉషశ్రీ కుటుంబ సభ్యులు అవనిగడ్డ ఎం.ఎల్.ఏ., ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అయిన మండలి బుద్ధప్రసాద్ గారిని కలిశారు. ఏపీ ప్రభుత్వం తరపున శతజయంతి నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుని కలిసి ఒక వినతి పత్రం సమర్పించేందుకు అవకాశం కల్పించాలని కూడా కోరారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తున్నందున... గోదావరి తీరాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారనీ, ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పుతున్నారనీ చెబుతూ, అక్కడ ఉషశ్రీ గారి విగ్రహాన్ని పెట్టే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఒక లేఖ తయారు చేసి ఇస్తే, తన వంతు ప్రయత్నం చేస్తానని బుద్ధ ప్రసాద్ చెప్పారు. 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ గారి శతజయంతి కార్యక్రమాన్ని తానూ ఏర్పాటు చేస్తానని చెప్పారు. దివిసీమ తుపాను అనంతరం ఉషశ్రీ గారు అవనిగడ్డ ప్రాంతంలో తిరిగి, ఆకాశవాణికి... వార్తలను, మానవీయ కథనాలను అందించడం తనకు తెలుసునని పేర్కొన్నారు. ఆ సమయంలో ఉషశ్రీ 'నిప్పచ్చరం' అనే కథ రాశారనీ, అది స్వాతి మాస పత్రికలో ప్రచురితమైందనీ, దానిని తానూ చదివానని బుద్ధ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. ఉషశ్రీ కుటుంబ సభ్యులతో పాటు అచ్చ తెనుగు శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ కూడా వచ్చారు.