|
|
by Suryaa Desk | Wed, Sep 24, 2025, 12:08 PM
వనస్థలిపురం ఓల్డ్ బాంబే- విజయవాడ హైవే వద్ద ధ్వంసం అయినా 900 ఎంఎం డయా ఆర్ సిసీ సీవర్ ట్రంక్ మెయిన్ పైప్ లైన్ అత్యవసర మరమ్మతుల పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో చర్చించారు. జలమండలి చేపట్టే మరమ్మతులు పైపు లైన్ విస్తరణ పనులు పూర్తయిన వెంటనే.. రోడ్డు మరమ్మతు పనులు నిర్వహించాలని ఆదేశించారు. సోమవారం సీవర్ లైన్‌పై సుమారు 20 అడుగుల లోతులో కుంగిపోవడంతో వెంటనే స్పందించిన జలమండలి అధికారులు మరమ్మతు పనులు పనులను ప్రారంభించారు. ఈ భారీ సీవర్ ట్రంక్ మెయిన్ దాదాపు 25 సంవత్సరాల క్రితం జీహెచ్ఎంసీ నిర్మించింది. అనంతరం 2021లో ఈ ప్రాంత సీవరేజ్ నిర్వహణ జలమండలికి అప్పగించారు.ఈ సీవర్ లైన్ దెబ్బతినడంతో, గాంధీనగర్, స్నేహమయినగర్, పివిఆర్ కాలనీ, పద్మావతి కాలనీ, వీరాంజనేయ కాలనీ, సామా నగర్, శారదా నగర్, శాంతినగర్, తెలంగాణ పద్మావతి కాలనీల పరిధిలోని సుమారు 5 కిమీ మేర అప్‌స్ట్రీమ్ సీవర్ లైన్‌లో చొకేజీ ఏర్పడి, స్థానిక చెరువులు పొంగిపోవడం, మురుగునీటి సమస్య తలెత్తింది.
ఈ సందర్భంగా ఎండీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, అలాగే రహదారిలో పూడుకుపోయిన ట్రంక్ మెయిన్ సంబందించిన మాన్‌హోళ్లను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటి సమస్యలు తలైతే అవకాశం ఉండే ప్రాంతాలను గుర్తించి ఇలాంటి సంఘటనలు నివారించాలని సూచించారు. అదే విధంగా, గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ హైవే క్రాసింగ్ వద్ద మురుగు సమస్యను ఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. సాగర్ కాంప్లెక్స్ వద్ద త్రిమలానగర్, శ్రీశ్రీ హోమ్స్, మధురా నగర్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చే మురుగు నీరు కలిసిపోవడంతో వర్షాకాలంలో స్తానికంగా మురుగు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు, వర్షపు నీరు సీవరేజ్‌లో కలిసిపోకుండా గ్యాప్ వర్క్ తక్షణమే చేపట్టాలని ఎండీ అధికారులను ఆదేశించారు.అలాగే ఓఅండ్ఎం, ఎస్టీపీ, ప్రాజెక్టు అధికారులు అందరూ సమన్వయంతో సీవరేజ్ నేరుగా మూసీలో చేరకుండా స్థానిక ఎస్టీపీ కి మళ్లించి, శుద్ధి చేసేలాగా పైప్ లైన్ ల ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి సీజీఎం నాగేందర్, జిఎంలు బలరామరాజు, మహేందర్ నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.