|
|
by Suryaa Desk | Sun, Jul 27, 2025, 06:20 PM
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల వరద నీరు చేరడంతో.. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు.మొదటగా హిమాయత్ సాగర్ జలాశయంను సందర్శించి.. వరద నీటి ఇన్ ఫ్లో వివరాలతోపాటు అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. జలాశయాల గేట్ల నిర్వహణలో రాజీ పడకూడదని అన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతినిత్యం సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలని, జంట జలాశయాల పరివాహక ప్రాంతాలలో గస్తీ పెంచాలని అన్నారు.ఇప్పటికే జంట జలాశయాలకు వరద మొదలైనందున జలమండలి ఎండీ.. రెవెన్యూ, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం కావాలని హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ ఎంసీ, హైడ్రా పోలీసు అధికారులతో సమన్వయంతో పనిచేయాలని జలమండలి అధికారులకు సూచించారు.అనంతరం నగరానికి మంచినీరు సరఫరా చేసే గండిపేట్ కాండూట్ కు అమర్చిన ప్రెసర్ ఫిల్టర్ ను పరిశీలించి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం ఓ అండ్ ఎం డివిజన్-18 మణికొండ డివిజన్ ఆఫీస్ ను సందర్శించిన ఎండీ.. అధికారులతో నీటి సరఫరా వివరాలను ఆరాతీశారు.ఈ కార్యక్రమంలో సీజీఎం బ్రిజేష్, జీఎంలు శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ లతో పాటు ట్రాన్స్ మిషన్ అధికారులు పాల్గొన్నారు.