|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 06:45 PM
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాలక్ష్మి పథకం ద్వారా.. రాష్ట్రంలోని మహిళలందరికి.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ సంస్థ భారీ లాభాలు చవి చూస్తుంది. మహిళలు మాత్రమే కాక మిగతా ప్రయాణికుల కోసం కూడా ఆర్టీసీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
అలానే ప్రధాన రద్దీ మార్గాలలో ప్రయాణిలకు సంఖ్యను పెంచుకునేందుకు ఆఫర్లు, డిస్కౌంట్ ప్రకటిస్తోంది. ఈక్రమంలో తాజాగా ఆర్టీసీ హైదరాబాద్ నగరం నుంచి పలు ప్రధాన మార్గాల్లో వెళ్లే బస్సు టికెట్ ధరల మీద భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో పాటు టూర్ ప్యాకేజీలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఇంతకు ఈ డిస్కౌంట్ వర్తించే మార్గాలు ఏవంటే..
హైదరాబాద్ నుంచి బెంగళూరు , విజయవాడ రూట్లలో నడిచే బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచడం కోసం ఆర్టీసీ.. భారీ డిస్కౌంట్ ప్రకటించింది. శ్రావణ మాసం కావడం.. ఆగస్టు నెలలో విద్యాసంస్థలు, ఆఫీసులకు పెద్ద సంఖ్యలో సెలవులు రావడం, రక్షాబంధన్ వంటి పండుగల నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉండటంతో.. విజయవాడ, బెంగళూరు రూట్లలో టికెట్ ధరల మీద డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ చెప్పుకొచ్చింది. డిస్కౌంట్ ప్రకటించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డిస్కౌంట్ ఎంతంటే..
హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు కోసం టీజీఎస్ఆర్టీసీ సంస్థ టికెట్ ధర మీద 16-30 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీని ప్రకారం..
హైదరాబాద్-విజయవాడకు గరుడ ప్లస్ బస్సు ఛార్జీ రూ.635 నుంచి రూ.444కు తగ్గింది.
గరుడ క్లాస్ ధర రూ.592-రూ.438కు తగ్గింది.
రాజధాని బస్సు టికెట్ ధర రూ.533-రూ.448గా దిగి వచ్చింది.
లగ్జరీ సూపర్ క్లాస్ ఛార్జీ రూ.815-రూ.685కు తగ్గించింది.
బెంగళూరు మార్గంలో
హైదరాబాద్ నుంచి బెంగళూరు రూట్‌లో సూపర్‌లగ్జరీ బస్సు టికెట్ ధర రూ.946-రూ.757కు తగ్గించారు.
లహరి ఏసీ స్లీపర్ బస్సులో బెర్త్ రూ.1569-రూ.1177కు,
ఏసీ స్లీపర్ బెర్త్ కమ్ సీటర్ ధర రూ.1203-రూ.903కు,
బెర్త్ రూ.1569-రూ.1177కు తగ్గించింది.
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఖమ్మం రీజియన్‌కు తాజాగా 58 కొత్త బస్సులను కేటాయించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ డిపోలకు పలు విడతల్లో ఈ బస్సులు చేరుకున్నాయి. వీటి పంపిణీ మే నెల నుంచి జులై 29 వరకు కొనసాగనుంది. ఈ 58 బస్సుల్లో డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులున్నాయి. ఈ 58 బస్సులు ఆయా డిపోలకు చేరుకున్న తర్వాత మరో విడతలో ఇంకో మళ్లీ 29 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఎక్కువ బస్సులు అవసరం ఉన్న మార్గాల్లో ఈ కొత్త బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.