|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 02:21 PM
శుక్రవారం.. సమయం సాయంత్రం 6.30 గంటలు...హైడ్రా డీఆర్ ఎఫ్ సిబ్బంది దుర్గం చెరువు తీగల వంతెనపై వర్షపు నీరు నిలవకుండా.. కిందకు వెళ్లే రంద్రాలను శుభ్రం చేస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు తీగల వంతెన నుంచి దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఇంతలో డీఆర్ ఎఫ్ సిబ్బందిలో ఒకరు ఆ దృశ్యాన్ని చూశారు. మొత్తం సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఒక వైపు ఉన్నవారు వద్దు.. వద్దు అని వారిస్తుంటే.. మరో వైపు నుంచి మెరుపు వేగంతో వచ్చి యువకుడిని చాకచక్యంగా డీఆర్ ఎఫ్‌కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఒడిసి పట్టి బయటకు లాగాడు. దీంతో ప్రమాదం తప్పింది. అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. పేరు రామి రెడ్డి (25) అని..పెళ్లి అయి.. ఒక పాప కూడా ఉందని విచారణలో తెలిసింది. మద్యానికి బానిసై.. తాగిన మత్తులో ఇంట్లో గొడవపడి వచ్చి ఆత్మహత్యకు యత్నించినట్టు తేలింది. అలిగి భార్య ఇంట్లోంచి వెళ్లిపోతే.. అతని సోదరికి రామిరెడ్డిని పోలీసులు అప్పగించారు.