|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 09:47 PM
రేషన్ కార్డుల జారీ ఒకసారి జరిగి ఆగిపోనే ప్రక్రియ కాదని, ఇది నిరంతరంగా కొనసాగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ధర్మపురిలో శుక్రవారం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ధర్మపురి నియోజకవర్గానికి మంజూరైన 7,932 కొత్త తెల్ల రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ రేషన్ కార్డులు పేదవారి జీవనోపాధికి తోడ్పడే సాధనమని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి పౌరుడికి రేషన్ కార్డు మంజూరు చేయడం లక్ష్యంగా పని చేస్తోందన్నారు. రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులన్నింటిని సమీక్షించి, అర్హులకు తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్. లత, ఆర్డీఓ మధుసూదన్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. లబ్దిదారులు తమ సమస్యల్ని అధికారులు సమక్షంలో వెల్లడించగా, వాటికి వెంటనే స్పందన లభించింది.