|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 01:54 PM
పేరుకు ప్రశంసలు, లోపల కోపం
కులగణన ప్రజెంటేషన్ సందర్భంగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రాహుల్‌గాంధీ సీఎం రేవంత్‌రెడ్డిని పలుమార్లు ప్రశంసించారు. బయటకు చూస్తే రాహుల్‌కు రేవంత్‌పై అసంతృప్తి తగ్గినట్లు కనిపించినా, పార్టీ వర్గాల్లో మాత్రం లోలోపల రాహుల్ కోపంతో ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయిలో కులగణన అంశం ప్రాధాన్యం కావడంతో, రాహుల్ తన అసంతృప్తిని బహిర్గతం చేయకుండా మెతక వైఖరి అవలంబించారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
రేవంత్‌కు బదులు భట్టికి ప్రాధాన్యం
సమావేశంలో కులగణన ప్రజెంటేషన్ బాధ్యతను రేవంత్‌రెడ్డికి కాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించారని తెలిసింది. అంతర్గత సమావేశంలోనూ రాహుల్ రేవంత్‌ను పెద్దగా పట్టించుకోలేదని, భట్టి ద్వారానే కులగణన వివరాలు తెలుసుకున్నారని సమాచారం. రేవంత్‌కు వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఇవ్వకపోవడంతో పాటు, రాహుల్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చే అవకాశం కూడా ఆయనకు దక్కలేదు. బదులుగా, భట్టి రాహుల్‌కు బొకే ఇవ్వగా, రేవంత్ మల్లికార్జున ఖర్గేకు బొకే అందించారు.
ప్రియాంకతో ఫొటో షేర్, రాహుల్‌తో దూరం
సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి తన ట్విటర్ ఖాతాలో ప్రియాంక గాంధీతో కలిసిన ఫొటోను షేర్ చేసి, కులగణన వివరాలు వివరించినట్లు పేర్కొన్నారు. అయితే, రాహుల్ గాంధీ, ఖర్గేలతో సమావేశం జరిగినప్పటికీ, ప్రియాంకతో ఫొటో షేర్ చేయడం పట్ల పార్టీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌తో సఖ్యతగా లేని నేపథ్యంలో ఈ చర్యను రాజకీయంగా చూస్తున్నారు.
రాహుల్‌ను ప్రసన్నం చేసేందుకు రేవంత్ తాపత్రయం
రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి మధ్య గత కొన్ని నెలలుగా గ్యాప్ ఏర్పడినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు రేవంత్ పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశంలో రాహుల్, సోనియా గాంధీలను ప్రసన్నం చేసేందుకు రేవంత్ తీవ్రంగా కృషి చేశారని, రాహుల్‌ను ఆకాశానికెత్తేలా మాట్లాడారని నేతలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, రాహుల్ వైఖరిలో మార్పు కనిపించలేదని చర్చలు సాగుతున్నాయి.