|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 11:12 PM
కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ ఆశించిన మేర జరగలేదు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంది. లక్షల సంఖ్యలో రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి రేషన్ కార్డులు పంపిణీ మొదలు పెట్టింది ప్రభుత్వం.
జులై 14 నుంచే తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ లాంఛనంగా ప్రారంభం అయ్యింది. మరో మూడు రోజుల్లో అనగా జులై 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ అమలు చేయనున్నారు. ఆగస్టు 10 వరకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
జులై 25 నుంచి ఆగస్టు 10 వరకు.. దాదాపు 15 రోజుల పాటు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా మంత్రులు, ఇంచార్జీ మంత్రులతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ.. అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 96.65 లక్షల రేషన్ కార్డులున్నాయని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నప్పటి నుంచి రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని సీఎం చెప్పుకొచ్చారు.
అలానే కొత్త రేషన్ కార్డుల స్టేటస్ తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ ను సంప్రదింవచ్చని అధికారులు సూచించారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా మీసేవా కేంద్రాల్లో సవరించుకోవచ్చు అని తెలిపారు. అలానే రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్డు రాని వారు ఇబ్బంది పడాల్సిన పని లేదని.. మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అలానే ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇక మూడు రోజుల్లోనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొదలు కాబోతుండటంపై జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.