|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 05:42 PM
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్), దాని ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ డి. అంబానీలను అధికారికంగా 'ఫ్రాడ్'గా వర్గీకరించినట్టు నిన్న పార్లమెంట్ తెలిపింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు ఫిర్యాదు చేసే ప్రక్రియలో బ్యాంక్ ఉన్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు.భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్దేశించిన 'మోసం రిస్క్ మేనేజ్‌మెంట్ మాస్టర్ డైరెక్షన్స్', ఎస్‌బీఐ బోర్డు ఆమోదించిన పాలసీకి అనుగుణంగా జూన్ 13 న ఈ వర్గీకరణ జరిగినట్టు మంత్రి చౌదరి వివరించారు. ఈ వర్గీకరణను బ్యాంక్ జూన్ 24న ఆర్బీఐకి నివేదించింది.ఎస్‌బీఐకి ఆర్‌కామ్ పెద్ద మొత్తంలో బకాయి పడింది. ఇందులో రూ. 2,227.64 కోట్ల ఫండ్-బేస్డ్ ప్రిన్సిపల్ బకాయి (ఆగస్టు 26, 2016 నుంచి వడ్డీ, ఇతర ఖర్చులు సహా), రూ. 786.52 కోట్ల నాన్-ఫండ్ బేస్డ్ బ్యాంక్ గ్యారెంటీ ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఆర్‌కామ్ మొత్తం రుణం మార్చి 2025 నాటికి రూ. 40,400 కోట్లుగా ఉన్నట్టు రాయిటర్స్ నివేదించింది.